PM Modi Inaugurates Various Projects : ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రేమ, అభిమానానికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని మోదీ భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో విశాఖలో 2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. విశాఖ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ వర్చువల్‌గా పలు ప్రాజెక్టులకు, అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేశారు. రాష్ట్ర ప్రజల కల, విభజన హామీల్లో కీలకమైన విశాఖ రైల్వేజోన్‌తో పాటు పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్కులకు శంకుస్థాపన చేశారు. సభా వేదిక పైనుంచి అభివృద్ధి పనులకు ప్రారంభించారు. రైల్వే, రోడ్డు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.
రాష్ట్రానికి అండగా ఉంటాము: ఈ క్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ అంతే కాకుండా రాష్ట్ర ప్రజల ఆశలు, ఆశయాల సాధనకు మద్దతుగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి అన్ని రంగాల్లో మద్దతుగా నిలుస్తున్నామని అన్నారు. విశాఖలో తలపెట్టిన ప్రాజెక్టులు రాష్ట్ర వికాసానికి తోడ్పడతాయని వివరించారు. ఐటీ, టెక్నాలజీకి ఏపీ ప్రధాన కేంద్రం కానుందని తెలిపారు. దేశంలో 2 గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లు వస్తుంటే దానిలో ఒకటి విశాఖకు కేటాయించామని అన్నారు. నక్కపల్లిలో బల్క్‌డ్రగ్ పార్కుకు శంకుస్థాపన చేశామని కేవలం 3 రాష్ట్రాల్లోనే ఇలాంటి పార్కులు వస్తున్నాని వివరించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు పునాదిరాయి వేశామని దీని ద్వారా రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 7 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయని ప్రధాని తెలిపారు.
ప్రపంచం మెచ్చే ఏకైక నాయకుడు మోదీ: సీఎం చంద్రబాబు
లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు : అనకాపల్లి జిల్లా పూడిమడకలో లక్షా 85 వేల కోట్ల పెట్టుబడితో 1200 ఎకరాల్లో నిర్మించనున్న ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ పనులకు ప్రధాని ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 25 వేల మందికి ఉపాధి లభించనుంది. నక్కపల్లిలో 2 వేల ఎకరాల్లో 1867 కోట్లతో ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ పార్కుకు ప్రధాని శంకుస్థాపన చేశారు. దీనివల్ల 10 నుంచి 14 వేల కోట్ల పెట్టుబడులతోపాటు సుమారు 28 వేల మందికి ఉపాధి లభించనుంది. చెన్నై- బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా తిరుపతి జిల్లాలో క్రిస్ సిటీకి వర్చువల్‌గా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
17 రోడ్ల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన : రాష్ట్రవ్యాప్తంగా 17 రోడ్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. 242 కోట్లతో ఆదోని బైపాస్, 245 కోట్లతో నిర్మించనున్న దోర్నాల - కుంట జంక్షన్, 601 కోట్లతో నిర్మించనున్న సంగమేశ్వరం- నల్లకాలువ, వెలుగోడు- నంద్యాల రోడ్ల విస్తరణ పనులకు ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. చిలకలూరిపేటలో 6 లేన్ల బైపాస్‌ను జాతికి అంకితం చేశారు. వీటితోపాటు రైల్వే ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. గుంటూరు-బీబీనగర్, గుత్తి-పెండేకల్లు రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు శంకుస్థాపన చేశారు.
మోదీ రాకతో రూ.2.10 లక్షల కోట్ల పెట్టుబడులు - 7.5 లక్షల మందికి ఉపాధి: పవన్