Pratidhwani Debate On Union Budget 2025 : కేంద్రబడ్జెట్ 2025 సమయం సమీపిస్తున్న తరుణంలో అందరిచూపు రానున్న బడ్జెట్ అంచనాల వైపే. వస్తువుల ధరల్లో తగ్గేవి ఏవి? పెరిగేవి ఏవి? అని సామాన్య ప్రజలు ఎదురుచూస్తున్నారు. అలాగే ఆదాయ పన్ను రేట్లు, శ్లాబుల వచ్చే మార్పులు, చేర్పులు ఏమిటని వేతన, మధ్యతరగతి జీవులు చూస్తున్నారు. అదేవిధంగా విధానపరమైన నిర్ణయాలు, ప్రాధాన్యాల్లో ఎలాంటి మార్పులు రావొచ్చు? అవి తమకు కలిసొచ్చేవా? సవాళ్లను తీసుకుని వస్తాయా? అని పరిశ్రమ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. మొత్తంగా ఈ మూడు వర్గాల చూపూ ఇప్పుడు ఫిబ్రవరి-1 వైపు ఉంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలమ్మ పద్దు వైపు గట్టిగానే దృష్టి కేంద్రీకరించారు. మరి బడ్జెట్ సంప్రదింపుల్లో భాగంగా నలువైపుల్నుంచి వస్తున్న వినతుల్లో ఎన్నింటికి తుదికూర్పులో చోటు దక్కే అవకాశాలున్నాయి? ఎన్డీయే 3.0లో తొలి పూర్తి బడ్జెట్ ఎలా ఉండబోతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో పాల్గొంటున్న వారు 1) వీవీకే ప్రసాద్ (వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండీ, హైదరాబాద్), 2) డా. తిరునహరి శేషు (కేయూ ఆర్థిక శాస్త్ర విభాగం, వరంగల్)
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మరికొన్ని రోజుల్లో ఎన్డీయే ప్రభుత్వం 3.0లో తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టబోతోందని తెలిపారు. ఈసారి బడ్జెట్ ప్రాధాన్యాలు ఎలా ఉండే అవకాశం ఉందనే ఆసక్తి అందరిలో ఉందన్నారు. సామాన్యులు, వేతనజీవులు, మధ్యతరగతి, పరిశ్రమ వర్గాలు ఇలా విభాగాల వారిగా చూసినప్పుడు కేంద్ర బడ్జెట్‌పై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయని వివరించారు. 'పన్నుల భారం బాగా పెంచారు. చివరికి పొదుపు చేసుకుందామని అనుకుంటే దాని మీద పన్నులు విధిస్తున్నారు. పెరిగిన ధరల వలన సతమతం అవుతున్న మిడిల్ క్లాస్ ఇన్‌కంటాక్స్ రిలీఫ్స్ ఆశించటంలో తప్పేముంది' అని అన్నారు. కేంద్రప్రభుత్వం ఈ విషయాన్ని ఎందుకు సీరియస్‌గా తీసుకోవటం లేదని ప్రశ్నించారు.
ప్రస్తుతం దేశంలో అందర్నీ కలవర పెడుతోంది ద్రవ్యోల్బణమే. వడ్డీ రేట్లు మొదలు ఆర్థిక విధాన నిర్ణయాలన్నీ దానికేంద్రంగానే ఉంటున్నాయని తెలిపారు. దాని కట్టడికి బడ్జెట్ ద్వారా ఏం చేయవచ్చు అనే విషయాలను కేంద్రం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దేశంలో కొంతకాలంగా నిరుద్యోగ సంక్షోభమే నెలకొంది. గత బడ్జెట్‌లలోనూ దీనిపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నా పరిస్థితుల్లో పెద్దగా మార్పు వచ్చిందైతే లేదన్నారు. ఇకనైనా ఏం చేయాలనే అంశలపై చర్చించాలని తెలిపారు.
అలాగే గృహరుణాల వడ్డీ రేట్లు తగ్గుతాయా? విద్యుత్ వాహనాలకు సంబంధించి కొత్త నిర్ణయాలు ఉంటాయా? ఈ రెండు కూడా చాలామంది ఎదురుచూస్తున్న అంశాలని తెలిపారు. మొత్తంగా చూసినప్పుడు సంస్కరణలు, సంక్షేమం ఈ రెండింటి విషయంలో బడ్జెట్ కేటాయింపులు ఎటువైపు మొగ్గే అవకాశాలున్నాయి? అనే దానికోసం వేచిచూడాలని స్పష్టం చేశారు.
భయపెడుతోన్న హెచ్‌ఎంపీవీ - ఎలా వ్యాపిస్తుంది? ఎలా అడ్డుకోవాలి?
ఏళ్లు గడుస్తున్నా - వ్యవసాయోత్పత్తుల ధరలపై సరైన నియంత్రణ ఎక్కడ?