NDA Alliance WonIrrigation Societies Elections in AP :రాష్ట్రంలో 6149 సాగునీటి సంఘాలకు నిర్వహించిన ఎన్నికల్లో 95 శాతానికి పైగా ఏకగ్రీవంగానే అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. అన్ని సంఘాలూ ఎన్డీయే కూటమి ఖాతాలోకే వచ్చాయి. కొన్ని గ్రామాల్లో అధికార పార్టీలోనే కొందరి నాయకుల మధ్య ఉన్న సమస్యలు, మిత్ర పార్టీల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలతో పాటు కొన్ని చోట్ల వైఎస్సార్సీపీ నాయకులు రంగ ప్రవేశం చేసి వివాదాలు సృష్టించడంతో ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలకు పోటీ అనివార్యమయింది. కొన్ని సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. అక్కడక్కడ పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది.
పులివెందులలో ఏకగ్రీవం :రాష్ట్రంలో మొత్తం 6149 సాగునీటి సంఘాలకు, 49020 ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులకు శనివారం ఎన్నికలు జరిగాయి. ఆయా ప్రాదేశిక నియోజకవర సభ్యులు సాగునీటి సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. ఈ సాగునీటి సంఘాల అధ్యక్షులు డిస్ట్రిబ్యూటరీ కమిటీల అధ్యక్షులను ఎన్నుకుంటారు. ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులకు అత్యధికంగా ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నికయ్యారు. సాధారణ సర్వసభ్య సమావేశాలు ఏర్పాటు చేసి అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలూ పూర్తి చేశారు.
జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో మొత్తం సాగునీటి సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. కూటమి పార్టీలకే అవి దక్కాయి. 1978 తర్వాత ఈ నియోజకవర్గంలో ఇలా కూటమి పార్టీ బలం చూపడం ఇదే ప్రథమం. వైఎస్సార్ జిల్లాలో నీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో అక్కడి ఎంపీ అవినాష్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆయన బయటకు వస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందని పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.