Nara Lokesh as Deputy CM : మంత్రి నారా లోకేశ్‌కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ టీడీపీ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. దీనిపై ఇప్పటికే పలువురు నేతలు స్పందించారు. తాజాగా లోకేశ్ డిప్యూటీ సీఎం అయితే తప్పేంటని కాకినాడ జిల్లా పిఠాపురం తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ ప్రశ్నించారు. టీడీపీ సభ్యత్వాలు కోటి చేయించిన ఘనత ఆయనకే దక్కుతుందని ఆయన కొనియాడారు. పిఠాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడారు.
టీడీపీకి భవిష్యత్ లేదన్న వారందరికీ యువగళంతో లోకేశ్ సమాధానం చెప్పారని వర్మ పేర్కొన్నారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఎవరి పార్టీ కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయని చెప్పారు. దీనిపై కొన్ని సామాజిక మాధ్యమాలు, మీడియా ఛానళ్లు వక్రభాష్యం చేయడం సరికాదని హితవు పలికారు. లోకేశ్ కష్టాన్ని గుర్తించాలని పార్టీ కోరుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఓడిపోయి, భవిష్యత్ ఏంటో కూడా తెలియని జగన్నే సీఎం, సీఎం అంటున్నారని వర్మ వ్యాఖ్యానించారు.
SVSN Varma on Nara Lokesh : ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను జనసేన కార్యకర్తలు సీఎం, సీఎం అని పిలుస్తున్నారని వర్మ తెలిపారు. అలాంటిది పార్టీని బలోపేతం చేసి, కార్యకర్తల్లో ధైర్యం నింపిన లోకేశ్‌ను డిప్యూటీ సీఎం అంటే తప్పేంటని ప్రశ్నించారు. కరడుగట్టిన టీడీపీ కార్యకర్తగా ఆయన ఉప ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇది తన ఒక్కడి అభిప్రాయం కాదని పార్టీ శ్రేణుల మనసులోని మాటని పేర్కొన్నారు. చివరికి తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకునే నిర్ణయమే కార్యకర్తలందరికీ శిరోధార్యమని వర్మ వెల్లడించారు.
"'కోటి సభ్యత్వాలు చేసిన ఘనత లోకేశ్‌కే దక్కుతుంది. పార్టీ పూర్తిగా పోయిందని, టీడీపీకి భవిష్యత్ లేదన్న వారందరికీ ఆయన యువగళంతో సమాధానం చెప్పారు. ఎవరి పార్టీ కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయి. దీనిపై సోషల్‌మీడియాతో పాటు కొన్ని మీడియా ఛానళ్లు వక్రభాష్యం చేయడం సరికాదు. లోకేశ్ కష్టాన్ని గుర్తించాలని కేడర్ కోరుకోవడంలో తప్పేముంది. ఇది నా ఒక్క అభిప్రాయం కాదు. టీడీపీ కార్యకర్తల మనసులో మాట.'' - ఎస్వీఎస్‌ఎన్ వర్మ, టీడీపీ నేత
మరోవైపు శనివారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్సార్ జిల్లా మైదుకూరులో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారా లోకేశ్ డిప్యూటీ సీఎం చేయాలని చంద్రబాబుని కోరారు. అలా చేస్తే పార్టీ భవిష్యత్ బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
టీడీపీ సభ్యత్వ నమోదులో రికార్డ్ - కార్యకర్తల ఇన్సూరెన్స్ కోసం ఒప్పందం