CM Chandrababu Fulfilled His Promise In YSR District: వైఎస్సార్ జిల్లా మైదుకూరు పర్యటనలో శనివారం సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు కొన్ని 24 గంటల్లోనే నెరవేరాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బలం చేకూరేలా ముఖ్యమంత్రికి ప్రత్యక్షంగా అందిన వినతులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మైదుకూరులో సీఎంకు అందిన వినతులపై జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వేగంగా స్పందించడంతో 24 గంటల్లోనే పరిష్కారం లభించింది.
2024 చరిత్ర తిరగరాసింది - అందరికీ భవిష్యత్‌పై భరోసా వచ్చింది: సీఎం చంద్రబాబు
అసలు కథేంటంటే? స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం సీఎం మైదుకూరులో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక వినాయకనగర్‌కు చెందిన విష్ణువందన ఇంటిని సీఎం సందర్శించారు. తడి, పొడి చెత్తను వేరు చేయడం, చెత్తతో సంపద సృష్టిస్తూ ఇంటి ఆవరణలో కూరగాయల సాగు చేస్తున్న విష్ణువందనను ఆయన అభినందించారు. ఆ సమయంలో ఆమె, కుటుంబ సభ్యులు పలు వినతిపత్రాలు అందజేయగా పరిశీలించి, సాయం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీంతో ఆదివారం కలెక్టర్ శ్రీధర్, జేసీ అదితిసింగ్ విష్ణువందన నివాసానికి వెళ్లి ఆ కుటుంబం నుంచి వచ్చిన 6 వినతుల్లో రెండింటిని పరిష్కరించారు. అవేంటంటే..
- విష్ణువందన మామ సుబ్బరాయుడికి వృద్ధాప్య పింఛను మంజూరు చేశారు.ఆమె భర్త వీరప్రసాద్‌కు ఉపాధి కోసం వెల్డింగ్ మిషన్ పంపిణీ చేశారు.
- అనారోగ్యంతో ఉన్న ఆమె తోడికోడలు ఉమా లక్ష్మీదేవికి ఇంటి వద్దే చికిత్స అందజేశారు
- విష్ణు వందనకు పొరుగుసేవల కింద ఉద్యోగం, ఉమా లక్ష్మీదేవి భర్త నాగేంద్రబాబుకు వాహన కొనుగోలు కోసం బీసీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం
- సుబ్బరాయుడి కుమార్తె కుమారుడు నీరజ్ చంద్‌కు ఉద్యోగం కల్పించాలని ఉపాధి కల్పన విభాగాన్ని కలెక్టర్ ఆదేశించారు.
హర్షం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు: సీఎం ఇచ్చిన హామీలను కొన్నింటిని వెంటనే నెరవేర్చడం, మరికొన్నింటికి చొరవ తీసుకోవడంపై విష్ణువందన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ, మెప్మా పీడీలు ఆనంద్ నాయక్, సురేష్‌రెడ్డి, బీసీ కార్పొరేషన్ ఈడీ జయసింహా, తహసీల్దారు రాజసింహ నరేంద్ర, కమిషనర్ ఎం.శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.
2025లో సీఎం తొలి సంతకం - 1600 మంది పేదలకు అందనున్న ఆర్థికసాయం
అమరావతి అభివృద్ధి చెందే నగరం - ఇక సినిమాలన్నీ ఏపీలోనే: సీఎం చంద్రబాబు