Graduate MLC Election 2025 : మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని కాంగ్రెస్ ఖరారు చేసింది. అభ్యర్థి ప్రకటన ఆలస్యమైనప్పటికీ గెలుపుపై మంత్రి శ్రీధర్‌బాబు ధీమా వ్యక్తం చేసిన మరుసటి రోజే స్పష్టత వచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీ నుంచి తప్పుకోగా, గతంలో ఎంపీగా పోటీ చేసిన వెలిచాల రాజేందర్ రావు, ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి పేర్లను అగ్రనాయకులు పరిశీలించారు. ఇరువురిలో నరేందర్ రెడ్డికి అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సీఈసీ షెడ్యూల్ ప్రకటించిన వెంటనే మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ స్థానాన్ని ఎవరికి కట్టబెట్టాలనే అంశంలో రాష్ట్ర నాయకత్వం జోరుగానే కసరత్తు చేసింది. రాష్ట్రంలో అధికారం ఛేజిక్కించుకున్న తర్వాత కీలకమైన ఈ ఎన్నికను మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం సవాలుగానే స్వీకరిస్తున్నారు. బీజేపీ ఓ అడుగు ముందుకేసి జనవరి 10నే అటు పట్టభద్రులు, ఇటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
ఈసారి పోటీ చేయని జీవన్ రెడ్డి :కాంగ్రెస్‌లో మాత్రం సిట్టింగ్ అభ్యర్థి జీవన్‌రెడ్డి పోటీ చేస్తారా లేదా అనే అంశంపై ప్రతిష్టంభన నెలకొంది. మరోవైపు గతంలో కరీంనగర్ అభ్యర్థిగా పోటీ చేసిన వెలిచాల రాజేందర్ రావు, ఆల్ఫోర్స్ విద్యాసంస్థ అధినేత నరేందర్‌రెడ్డి పేర్లు పరిశీలనకు వచ్చాయి. జీవన్‌రెడ్డి పోటీ చేయబోనని అధిష్ఠానానికి స్పష్టం చేయడంతో నరేందర్ రెడ్డి పేరును ఖరారు చేశారు.
పట్టభద్రుల స్థానం కోసం నరేందర్ రెడ్డి, వెలిచాల రాజేందర్‌రావు పేర్లను ఏఐసీసీకి పీసీసీ పంపినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. టికెట్ ఎవరికి వస్తుందనే విషయంలో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలకు స్పష్టత ఉన్నా, బయటకు చెప్పకుండా మిగతా ఆశావహుల్ని ఒప్పించే ప్రయత్నాలు అంతర్గతంగా జరిగాయి. విద్యావేత్తగా పట్టభద్రుల నియోజకవర్గంలోని 42 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాల్లో ప్రచారం పూర్తి చేసిన నరేందర్ రెడ్డినే ఏఐసీసీ ఖరారు చేసింది.