ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

నవనందుల నంద్యాల లోక్​సభ - వ్యూహాలకు పదును పెడుతున్న పార్టీలు - Nandyala Lok Sabha Constituency

Nandyala Lok Sabha Constituency : రాయలసీమ రాజకీయాల్లో నంద్యాల లోక్ సభ స్థానానికి ప్రత్యేకత ఉంది. నవనందుల కోటగా పిలిచే నంద్యాల దేశానికి ఒక ప్రధాని, ఒక రాష్ట్రపతిని అందించిన చరిత్ర ఉంది. ఎంతోమంది ఉద్ధండులు ఇక్కడి నుంచే పోటీ చేశారు. ఈసారి గెలుపు సాధించి హ్యాట్రిక్ కొట్టాలని వైసీపీ ఎత్తులు వేస్తోంటే ఎలాగైనా విజయం సాధించి సత్తా చాటాలని తెలుగుదేశం వ్యూహాలకు పదును పెడుతోంది.

nandyala_loksabha_constituency
nandyala_loksabha_constituency

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 26, 2024, 4:53 PM IST

నవనందుల నంద్యాల లోక్​సభ- వ్యూహాలకు పదునుపెడుతున్న పార్టీలు

Nandyala Lok Sabha Constituency : నంద్యాల పార్లమెంటు స్థానం నుంచి పీవీ నరసింహారావు, నీలం సంజీవ రెడ్డి, పెండే కంటి వెంకట సుబ్బయ్య లాంటి మహామహులు గెలుపొందారు. పీవీ ప్రధానిగా సేవలందిస్తే నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా పని చేశారు. పెండేకంటి వెంకటసుబ్బయ్య ఐదుసార్లు గెలుపొంది సిల్వర్ జూబ్లీ పార్లమెంటేరియన్ గా గుర్తింపు పొందారు. కేంద్ర మంత్రిగా, గవర్నర్ గా పనిచేశారు. 2014లో వైఎస్సార్సీపీ తరఫున ఎస్పీవై రెడ్డి గెలుపొందగా 2019లో వైసీపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించారు. ఈ సారి తెలుగుదేశం పార్టీ తరఫున రాయలసీమ ఉద్యమ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె బైరెడ్డి శబరి పోటీ చేస్తుండగా వైసీపీ తరఫున ప్రస్తుత ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ తరఫున విద్యార్థి ఉద్యమ నాయకుడు లక్ష్మీనరసింహ యాదవ్ పోటీ చేస్తున్నారు.

కర్నూలు​ లోక్​సభ బరిలో బీసీ అభ్యర్థులు - రసవత్తరంగా పోరు - kurnool loksabha

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల లోక్ సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఈ స్థానాన్ని జనరల్ కు రిజర్వ్ చేశారు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణకు ముందు ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు అసెంబ్లీ స్థానం నంద్యాల పార్లమెంటులో ఉండేది. అనంతరం దాన్ని ఒంగోలు లోక్ సభ నియోజకవర్గంలో కలిపారు. ప్రస్తుతం ఈ పార్లమెంటు స్థానం పరిధిలో ఆళ్లగడ్డ, నంద్యాల, శ్రీశైలం, బనగానపల్లి, డోన్, పాణ్యం, నందికొట్కూరు(ఎస్సీ) నియోజకవర్గాలు ఉన్నాయి. తాజా గణాంకాల ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 16 లక్షలా 97 వేలా 6 వందలా 96 మంది. వీరిలో పురుషులు 8 లక్షలా 33 వేలా 5 వందలా 89. మహిళలు 8 లక్షలా 63 వేలా 7 వందలా 70. ట్రాన్స్ జెండర్లు 3 వందలా 37. ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా... 10 సార్లు కాంగ్రెస్ పార్టీ, మూడుసార్లు టీడీపీ, రెండుసార్లు వైసీపీ, ఒకసారి జనతా పార్టీ గెలుపొందాయి.

'రాజు'లు ఏలిన నరసాపురం - ఆసక్తికరంగా రాజకీయ సమరం - Narasapuram LOK SABHA ELECTIONS

నంద్యాల లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు అన్ని చోట్లా బలమైన నాయకులకే టిక్కెట్లు కేటాయించాయి. డోన్ నియోజకవర్గంలో టీడీపీ తరఫున మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, వైఎస్సార్సీపీ తరఫున ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు. నంద్యాల అసెంబ్లీలో టీడీపీ నుంచి మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్, వైఎస్సార్సీపీ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి బరిలో నిలిచారు. ఆళ్లగడ్డలో టీడీపీ నుంచి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యే బ్రిజేంద్రనాథ్ రెడ్డి పోటీ పడుతున్నారు. శ్రీశైలం నుంచి టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి, వైఎస్సార్సీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి బరిలో నిలిచారు. ఎస్సీ నియోజకవర్గమైన నందికొట్కూరు నుంచి టీడీపీ తరఫున జయసూర్య పోటీ చేస్తుండగా వైఎస్సార్సీపీ తరఫున కడప జిల్లాకు చెందిన డాక్టర్ సుధీర్ పోటీ పడుతున్నారు. బనగానపల్లి నుంచి టీడీపీ తరఫున బీసీ జనార్దన్ రెడ్డి, వైఎస్సార్సీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తలపడుతున్నారు. పాణ్యం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గౌరు చరితారెడ్డి, వైఎస్సార్సీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి బరిలో నిలిచారు.

ప్రస్తుత వైఎస్సార్సీపీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డికి సీడ్ పరిశ్రమలు ఉన్నాయి. వీటి ద్వారా రైతులకు నకిలీ పత్తి విత్తనాలు విక్రయించారని, తద్వారా అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. అయినా... ఆయనకే మరోసారి వైసీపీ టిక్కెట్ కేటాయించింది. ఆయన ఎంపీగా ఉన్న ఐదేళ్ల కాలంలో నంద్యాలకు చేసింది ఏమీ లేదన్నది ప్రజల అభిప్రాయం. టీడీపీ యువ నాయకురాలు బైరెడ్డి శబరి ప్రచారంలో దూసుకుపోతున్నారు. తండ్రి రాజకీయ చాణక్యం కలిసొచ్చే అంశంగా నిపుణులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న లక్ష్మీనరసింహ యాదవ్ ఏమేరకు ప్రభావం చూపుతారో వేచి చూడాలి.

చిరుధాన్యాల కోట అనంతపురం - రసవత్తరంగా రాజకీయం - Anantapur LOK SABHA ELECTIONS

నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో గత ఐదేళ్లలో ఏ అభివృద్ధీ జరగలేదన్నది ఓటర్ల భావన. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించారు. పర్యావరణ అనుమతులు లేకపోవటంతో మధ్యలోనే ఈ ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. నాలుగేళ్లుగా అలగనూరు జలాశయం కట్ట మరమ్మతులు చేయకలేక చేతులెత్తేశారు. గోరుకల్లు జలాశయం కట్టకు పగుళ్లు వచ్చి ప్రమాదంలో పడినా పట్టించుకోలేదు. గాలేరు- నగరిని గాలికి వదిలేశారు. అవుకు టన్నెల్ ను పూర్తి చేయలేదు. తెలుగుగంగ ఆధునీకరణ పనులు చేపట్టలేదు. గుండ్రేవుల, జొలదరాశి, రాజోళి ప్రాజెక్టుల నిర్మాణానికి ఒక్క అడుగూ ముందుకు పడలేదు. నంద్యాల పట్టణానికి తాగునీరు అందించేందుకు గత ప్రభుత్వం 70 శాతం పూర్తి చేసిన అమృత్ పథకాన్ని పూర్తి చేయలేదు. 77 చెరువుల పథకాన్ని ప్రారంభించినా ఇప్పటికీ 90 శాతం చెరువులను నింపలేకపోయారు. నేటికీ గ్రామాలు, పట్టణాల్లో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొంది. తంగడంచ సీడ్ పార్కును అటకెక్కించారు. దీని వల్ల ఎంతో మందికి ఉపాధి లేకుండా పోయింది. రాయల్టీలు, విద్యుత్ ఛార్జీలు భారీగా పెరగటంతో డోన్, బనగానపల్లి నియోజకవర్గాల్లోని గ్రానైట్, నాపరాయి పరిశ్రమలు మూతపడుతున్నాయి. నంద్యాలకు కొత్త పరిశ్రమలు వచ్చే పరిస్థితులు ఏమాత్రం కనిపించటం లేదు. తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేవారికే ఓటు వేస్తామని స్థానికులు చెబుతున్నారు.

సాంస్కృతిక రాజధాని రాజమండ్రి - కాంగ్రెస్​ కంచుకోటకు టీడీపీ బీటలు - Rajahmundry LOK SABHA ELECTIONS

ABOUT THE AUTHOR

...view details