NTR 101 BirthDay Anniversary Celebrations in AP : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 101వ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. టీడీపీ అభిమానులు, కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి నివాళులర్పించారు. ప్రపంచంలో తెలుగుజాతికి గుర్తింపు తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని గుర్తు చేసుకున్నారు.
విజయవాడ టీడీపీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి వేడుకలను ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద ప్రజల అభివృద్దికి విశేష కృషి చేసిన మహానాయకుడు ఎన్టీఆర్ అని నేతలు కొనియాడారు. తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రదాత ఎన్టీఆర్ అని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సినిమా రంగంలో ఎన్నో పాత్రలకు జీవం పోసి విశ్వవిఖ్యాత నటసార్వభౌముడుగా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
తెలుగు ప్రజలకు తీపి కబురు.. 100 రూపాయల వెండి నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని మన్యం జిల్లా పార్వతీపురం టీడీపీ ఇన్‌ఛార్జ్ బోనెల విజయచంద్ర అన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాయి. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు. పాలు పంపిణీ చేశారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 101 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
కర్నూలు జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నంద్యాలలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను తెలుగుదేశం నేతలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ జెండా ఎగురవేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేశారు.
"ప్రజా సంక్షేమానికి ఆద్యుడు.. ఈ నెల 28న ఎన్టీఆర్ ప్రసంగాల గ్రంథం ఆవిష్కరణ"
సినీ, రాజకీయ జీవితంలో ఎన్టీఆర్‌కు ఎవరూ సాటి లేరని చిత్తూరు జిల్లా పలమనేరు టీడీపీ నేతలు కొనియాడారు. పట్టణంలోని టీడీపీ కార్యలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీనియర్ కార్యకర్తలను సన్మానించారు. సత్యసాయి జిల్లా కదిరి టీడీపీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తెలుగుదేశం కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు నిర్వహించారు. తెలుగుదేశం పతాకావిష్కరణ చేసి కేక్ కట్ చేశారు. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. టెక్కలిలో టీడీపీ మండల అధ్యక్షుడు బగాది శేషగిరిరావు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు.
ఎన్టీఆర్‌తో కలిసి 100 సినిమాలు చేసిన రికార్డు కైకాలదే
పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ నేత చదలవాడ అరవింద బాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగువారి ఆత్మాభిమానాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారకరామారావు అని బాపట్ల జిల్లా చీరాల టీడీపీ నేత ఎంఎం కొండయ్య అన్నారు. చీరాల టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యాలయం ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్‌చేశారు.