MP Candidates Voting Constituencies :సాధారణంగా ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసే అభ్యర్థులు తమ సొంత నియోజకవర్గాల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం చూస్తుంటాం. అయితే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు మాత్రం తమ ఓటును తమకు వేసుకోలేకపోయారు.
తమ ఓటు తమకు ఓటు వేసుకోలేకపోయిన ఎంపీ అభ్యర్థులు :హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవీ లత తమ సొంత నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. దీనికి కారణం మాధవీ లత ఇళ్లు ఈస్ట్ మారేడుపల్లిలో మహేంద్రహిల్స్‌లో ఉండటమే దీనికి కారణం. ఇది మల్కాజిగిరి నియోజకవర్గంలోకి వస్తుంది. ఫలితంగా ఈమె తన ఓటును తనకు వేసుకోలేకపోయారు.
తన ఓటు తనకు వేసుకోలేకపోయిన అసదుద్దీన్ :మరోవైపు హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ నివాసం రాజేంద్రనగర్ పరిధిలో ఉంది. ఈ ప్రాంతం చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఆయన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. దీంతో తన ఓటును తనకు వేసుకోలేని పరిస్థితి నెలకొంది. చేవెళ్ల ప్రాంతంలో ఎంఐఎం పార్టీ అభ్యర్థి ఎవరూ బరిలో లేరు. దీంతో తన ఓటును వేరొకరికి వేయాల్సిన పరిస్థితి నెలకొంది.
కాంగ్రెస్ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆమె ఓటు తాండురు అసెంబ్లీ పరిధిలో ఉంది. ఆ ప్రాంతం చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోకి వస్తున్నందున తన ఓటు తాను వేసుకోకుండా ఇతరులకు వేయాల్సిన పరిస్థితి నెలకొంది.