తెలంగాణ

telangana

ETV Bharat / politics

జీవన్‌రెడ్డి సీనియర్‌ నేత - ఆయనకు హామీ ఇచ్చే స్థాయిలో మేము లేము : మంత్రి శ్రీధర్​బాబు - MLC Jeevan Reddy Plans to Resign

MLC Jeevan Reddy Considering Resigning : జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌లో చేరిక ఆ పార్టీలో చిచ్చురేపింది. సంజయ్ చేరికతో ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై తన అనుచరులు, పార్టీ శ్రేణులతో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన మంత్రి శ్రీధర్‌బాబు, హైదరాబాద్‌ నుంచి జగిత్యాలకు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

By ETV Bharat Telangana Team

Published : Jun 24, 2024, 3:54 PM IST

Updated : Jun 24, 2024, 9:46 PM IST

MLC Jeevan Reddy Plans to Resign
MLC Jeevan Reddy Considering Resigning (ETV Bharat)

MLC Jeevan Reddy Plans to Resign : జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ ఆదివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నేపథ్యంలో జిల్లా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ వ్యవహారంతో అసంతృప్తికి గురైన హస్తం పార్టీ ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. అయితే రాజీనామా చేయనున్నట్లు తెలియగానే ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఆది శ్రీనివాస్‌ వెనువెంటనే జీవన్‌రెడ్డి నివాసానికి చేరుకుని ఆయణ్ను బుజ్జిగించే పనిలో పడ్డారు.

ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని వారు కోరినట్లు సమాచారం. రాజీనామాకు సిద్ధపడ్డారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో రంగంలోకి దిగిన మంత్రి శ్రీధర్‌బాబు, హైదరాబాద్‌ నుంచి జగిత్యాలకు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే సంజయ్‌ను పార్టీలో చేర్చుకోవాల్సి వచ్చిందనే అంశాలపై జీవన్‌రెడ్డికి మంత్రి సావధానంగా వివరించినట్లు తెలిసింది. మంత్రి శ్రీధర్‌బాబు రాక గురించి తెలియగానే పెద్దసంఖ్యలో జీవన్‌రెడ్డి ఇంటికి చేరుకున్న కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలతో హోరెత్తించారు.

"మేమందరం కూడా ఆదివారం జరిగిన ఎమ్మెల్యే సంజయ్​ పార్టీ చేరిక విషయంలో పెద్దలు జీవన్​రెడ్డి మనస్థాపానికి గురయ్యారని తెలుసుకున్నాం. అందుకే మేమంతా వచ్చి ఆయణ్ను కలిశాం. రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్​ పక్షాన నిలిచి, పెద్ద దిక్కుగా జీవన్​రెడ్డి ఉండాలని కోరుకుంటున్నాం. ఆయన అసంతృప్తిని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి, సీఎం రేవంత్​, దీపాదాస్‌ మున్షి, ఖర్గే దృష్టికి తీసుకెళ్తాం."- శ్రీధర్‌బాబు, మంత్రి

MLC Jeevan Reddy Impatience : 40 ఏళ్లుగా పార్టీలో ఉన్న తనకు కనీసం సమాచారం లేకుండా బీఆర్ఎస్ నేతను పార్టీలో చేర్చుకోవడంతో తాను తీవ్ర మనస్థాపానికి గురయ్యానని జీవన్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంపై అనుచరులతో సమాలోచనలు చేస్తున్నట్లు చెప్పారు. జీవన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నారన్న విషయం తెలియగానే కాంగ్రెస్‌ అనుచరులు ఆయన ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే పార్టీ అధిష్ఠానం నుంచి పెద్దలు ఆయనతో మాట్లాడుతున్నారు. దీని తర్వాత ఆయన తన నిర్ణయం వెల్లడించనున్నట్లు తెలిసింది.

జగిత్యాల నియోజకవర్గంలో 2014 నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యే సంజయ్‌, జీవన్‌రెడ్డి ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లోనూ వీరిద్దరే పోటీపడ్డారు. ఈ నేపథ్యంలో తనకు తెలియకుండా సంజయ్‌ను హస్తం గూటికి చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్లు గౌరవప్రదంగా రాజకీయాలు చేశానని, పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానని సన్నిహితుల వద్ద జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

కర్మ ఈజ్ బ్యాక్ - అప్పుడు మీరు అలా చేశారు - అందుకే ఇప్పుడు? : షబ్బీర్ అలీ

హస్తం గూటికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్​ కుమార్​ - కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ - Jagtial BRS MLA Join Congress

Last Updated : Jun 24, 2024, 9:46 PM IST

ABOUT THE AUTHOR

...view details