MLA AND MP Candidates Election Campaign :అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలో ఉరవకొండ కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్ రోడ్ షో నిర్వహించారు. సైకిల్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కూటమి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డికి మద్దతుగా నియోజకవర్గంలోని కొత్తచెరువు, తెలమర్లలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రచారం చేశారు. తమ గ్రామంలో తెలుగుదేశం ఎన్నికల ప్రచారం నిర్వహించొద్దంటూ తెలమర్లలో కొందరు వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. ఇరువైపులా తోపులాట జరగడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. హిందూపురం కూటమి అభ్యర్థి బాలకృష్ణకు మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ప్రచారం చేశారు. పట్టణంలోని మైనారిటీ వార్డుల్లో పర్యటించి బాలకృష్ణను గెలిపించాలని ఓటర్లను కోరారు.
Election Campaign in Andhra Pradesh :కర్నూలు జిల్లా ఆదోని కూటమి అభ్యర్థి పార్థసారథి మండలంలోని కొన్ని గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలు వివరించి ఓట్లు అభ్యర్థించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని సోమప్పనగర్‌లో కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. తర్వాత చేనేతలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కర్నూలు కూటమి అభ్యర్థి టీజీ భరత్ నగరంలోని 23వ వార్డులో ప్రచారం నిర్వహించారు. స్థానికులు భరత్‌కు సమస్యలు ఏకరవు పెట్టగా అన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా డోన్ మండలంలోని కొన్ని గ్రామాల్లో కూటమి అభ్యర్థి జయసూర్యప్రకాష్‌రెడ్డి సతీమణి కోట్ల సుజాతమ్మ ఇంటింటి ప్రచారం చేశారు. కామగానిగుంట్ల గ్రామంలోని ఓ ఇంటి వద్ద రొట్టెలు చేస్తున్న మహిళ వద్దకు వెళ్లి కింద కూర్చుని తానూ ఓ రొట్టె చేసి కాల్చారు.
కూటమి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తారన్న దాంట్లో వాస్తవం లేదని గుంటూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని మోటార్ ఫీల్డ్ అసోసియేషన్ సభ్యులతో ఆటోనగర్‌లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అమరావతిని అభివిృద్ధిని చేసే వారినే ఎన్నికల్లో గెలిపించాలంటూ రాజధాని రైతులు గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి నారా లోకేశ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పేదరికంలేని సమాజం, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనే చంద్రబాబు ధ్యేయమని బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు అన్నారు. మార్టూరులోని నేతాజీ నగర్, రాంనగర్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గద్దె రామ్మోహన్ 12వ డివిజన్‌లో ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ తెలుగుదేశం సూపర్‌సిక్స్ పథకాలు వివరించారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం మంజులూరులో పెడన కూటమి అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి బాలసౌరి కుమారుడు అనుదీప్ గడప గడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. పెనమలూరు కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్ నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రచారం చేశారు. అవనిగడ్డ కూటమి అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్‌ను గెలిపించాలంటూ ఆయన కుమార్తె, కోడలు ప్రచారం నిర్వహించారు. రాష్ట్రబీసీ సంక్షేమ సంఘం తరఫున మండలి బుద్ధప్రసాద్‌కు పూర్తి మద్దతు ప్రకటిస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు తెలిపారు.
ఏలూరు జిల్లా దెందులూరు కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ పెదవేగి మండలంలో ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి మండలంలోని గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. మైనారిటీల పథకాలు ఎత్తేసి వైసీపీ ప్రభుత్వం ద్రోహం చేసిందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు షరీఫ్ అన్నారు. ఏలూరు కూటమి అభ్యర్థి బడేటి రాథాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఏలూరు వైసీపీ అభ్యర్థి ఆళ్ల నాని పట్టణంలోని వార్డుల్లో ప్రచారం చేశారు.