YS Sharmila on Vijayasai Reddy Resignation: జగన్ (YS Jagan Mohan Reddy) విశ్వసనీయత కోల్పోయినందునే విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. విజయవాడలో మీడియాతో షర్మిల మాట్లాడారు. విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ నుంచి బయటకు వచ్చినందున ఇప్పటికైనా నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
నిజం చెప్పినందుకు సంతోషం: ఇంతవరకు విజయసాయిరెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలు అని తనకు కూడా తెలుసునని, వివేకా హత్య విషయంలో ఇప్పటికి ఓ నిజం చెప్పినందుకు సంతోషం అన్నారు. మిగతా విషయాలు కూడా బయట పెట్టాలని షర్మిల కోరారు. విజయసాయి రెడ్డి జగన్‌కు అత్యంత సన్నిహితుడని, జగన్ ఏ పని చేయమని ఆదేశిస్తే ఆ పని చేసేవారని అన్నారు. ఎవరిని తిట్టమంటే వాళ్లను తిట్టడమే విజయసాయి రెడ్డి పని అని పేర్కొన్నారు.
నా అనుకున్నవాళ్లను కాపాడుకోలేక పోతున్నారు: రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగానూ తన బిడ్డల విషయంలో అబద్ధాలు చెప్పిన వ్యక్తి సాయి రెడ్డి అని మండిపడ్డారు. ఈ అబద్ధాలు జగన్ చెప్తేనే విజయసాయి రెడ్డి చెప్పారని, అలాంటి జగన్ సన్నిహితుడు రాజీనామా చేశారంటే చిన్న విషయం కాదన్నారు. జగన్ మోహన్ రెడ్డిని విజయసాయి రెడ్డి వదిలేశారు అంటే దానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి సన్నిహితులు ఒక్కొక్కరుగా ఎందుకు వెళ్తున్నారని అన్నారు.
జగన్ విశ్వసనీయత కోల్పోయారు: జగన్ కోసం ప్రాణం పెట్టిన వాళ్లు ఎందుకు వీడుతున్నారు? అనేది వైఎస్సార్సీపీ (YSRCP) కార్యకర్తలు, వైఎస్ అభిమానులు ఆలోచన చేయాలని షర్మిల సూచించారు. నాయకుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశ్వసనీయత కోల్పోయారని, ప్రజలను, నమ్మినవాళ్లను నాయకుడిగా జగన్ మోసం చేశారని షర్మిల మండిపడ్డారు. నా అనుకున్నవాళ్లను జగన్ మోహన్ రెడ్డి కాపాడుకోలేక పోతున్నారని అన్నారు. జగన్ విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయి పార్టీని వీడారని పేర్కొన్నారు. బీజేపీకి జగన్ దత్తపుత్రుడని ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లు సాయి రెడ్డిని జగన్ తన పక్కన పెట్టుకొని బీజేపీకి అనుకూలంగా ఉన్నారని షర్మిల ఆరోపించారు.
రాజకీయాల నుంచి తప్పుకుంటే నాపై కేసులు ఎందుకు తొలగిస్తారు : విజయసాయిరెడ్డి
అంతకుముందు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలోని సూపర్-6 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద పల్లెం, గరిట పట్టుకొని షర్మిల నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి 7 నెలలు అయింది కానీ నేటికీ సూపర్-6 పథకాలు అమలు చేయలేదన్నారు.
"ఎన్నికలకు ముందు రియల్ ఎస్టేట్ ప్రమోషన్లా సూపర్-6 బ్రోచర్‌ను విడుదల చేశారు. 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. నిరుద్యోగ భృతి కింద 3 వేలు ఇస్తామని మోసం చేశారు. తక్షణమే సూపర్-6 పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల్ని తీవ్రతరం చేస్తాం". - షర్మిల, పీసీసీ అధ్యక్షురాలు