Ministers Ponnam And Komatireddy Started Buses in Nalgonda :రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఏసీ బస్సులను ప్రారంభిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నల్గొండ జిల్లాలో మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. అనంతరం కొత్తగా ఏర్పాటు చేసిన బస్సులను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పొన్నం అధికారంలోకి వచ్చిన 48 గంటలలోనే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసినట్లు గుర్తు చేశారు.
కొత్తగా 1000 బస్సులు కొనుగోలు చేశామన్న ఆయన, మరో 1500 బస్సులకు ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు. నల్గొండ జిల్లాలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బస్సుల సంఖ్య పెంచినట్లు వివరించారు. దసరాలోపు నల్గొండ జిల్లాకి 30 ఎక్స్‌ప్రెస్‌లు, 30 లగ్జరీ బస్సులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 3,035 కొత్త ఉద్యోగాలకు నియామకాలు చేపట్టామన్న మంత్రి, నష్టాల్లో లేకుండా ఆర్టీసీని నడిపిస్తున్నట్లు వివరించారు.
"నార్కట్ పల్లి బస్టాండ్‌కు పునర్వవైభవం తీసుకువస్తాం. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్నాం. 21 శాతం డీఏ ఇచ్చాం రూ.280 కోట్ల బకాయిల్లో రూ.80 కోట్లు చెల్లించాం. మిగిలిన రూ.200 కోట్లను ఈ నెలాఖరులోగా చెల్లిస్తాం. కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండటం వల్ల కాస్త ఆలస్యమైంది. అందుకు మన్నించాలని ఆర్టీసీ కుటుంబ సభ్యులను కోరుతున్నాను. ప్రతి నియోజకవర్గం కేంద్రం నుంచి లగ్జరీ బస్సులు నడుపుతాం. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఏసీ బస్సులను ప్రారంభిస్తాం."- పొన్నం ప్రభాకర్, మంత్రి