Ministers Introduced Bills in AP Assembly:శాసనసభ గురువారం ఎనిమిది కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. లోకాయుక్త సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ బిల్లును రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, మునిసిపల్ లా బిల్లును పురపాలకశాఖ మంత్రి నారాయణ, వస్తు, సేవల సవరణ బిల్లు, విలువ ఆధారిత పన్ను బిల్లును ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ప్రమాదకర అసాంఘిక కార్యకలాపాల నిరోధక సవరణ బిల్లును హోంమంత్రి అనిత, హిందూ ధార్మిక మత సంస్థలు, దేవాదాయ చట్ట సవరణ బిల్లును మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మౌలిక సదుపాయాలు, న్యాయపరమైన పారదర్శకత, జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు బిల్లును మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ప్రవేశపెట్టారు. వీటిపై చర్చ అనంతరం సభ ఆమోదం తెలిపింది.
ప్రమాదకర అసాంఘిక కార్యకలాపాల నిరోధక సవరణ బిల్లులో ఇసుక అక్రమ రవాణా, బియ్యం బ్లాక్ మార్కెటింగ్‌కు తరలింపునకు అడ్డుకట్ట వేయడాన్ని అప్పటికప్పుడు పొందుపరుస్తూ హోంమంత్రి అనిత ప్రతిపాదించారు. దీన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
మూడు కీలక తీర్మానాలకు ఆమోదం
శాసనసభ గురువారం మూడు కీలక తీర్మానాలకు ఆమోదం తెలిపింది. ఏపీ లోకాయుక్త చట్ట సవరణ బిల్లు, చెత్త పన్ను రద్దు, సహజవాయువు వినియోగంపై జీఎస్టీ సవరణ బిల్లులకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. లోకాయుక్త పదవీకాలం 5 ఏళ్ల పాటు కొనసాగించడంతోపాటు ఎంపికలో ప్రతిపక్ష నేత సభ్యుడిగా లేనప్పుడు పార్లమెంట్ సంప్రదాయాల్ని అనుసరించేలా చట్ట సవరణ చేస్తూ ఆర్థికమంత్రి కేశవ్ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లును సభ ఆమోదించింది.