Condolences to Ratan Tata :దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా(86) మృతి పట్ల సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు సంతాపం ప్రకటించారు. రతన్ టాటా మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలిపారు. రతన్ టాటా వ్యాపారవేత్త మాత్రమే కాదని, నిజమైన మానవతావాదిని కోల్పోయామని అన్నారు. రతన్‌ను అభిమానించేవారికి, టాటా గ్రూప్‌నకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటు అని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. రతన్ టాటా మహా దార్శనికుడు అని కొనియాడిన మంత్రి నారా లోకేశ్.. విలువలు, మానవత్వంతో కూడిన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారని అన్నారు. టాటా గ్రూప్ ఉత్పాదనలు వాడని భారతీయులు ఉండరని గుర్తు చేస్తూ రతన్ టాటా సేవలు చిరస్మరణీయమని సంతాపం వెలిబుచ్చారు.
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
వంద దేశాల్లో 30కి పైగా పరిశ్రమలను స్థాపించి విజయవంతంగా నడిపించిన అనితర సాధ్యుడికి అంతిమ నివాళి అని హోంమంత్రి వంగలపూడి అనిత, రతన్ టాటా నిజమైన మానవతావాది అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రతన్ టాటా యువతకు ఎంతో ఆదర్శప్రాయమని, సామాజిక సేవకు నిలువెత్తు నిదర్శనమని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కీర్తించారు. రతన్ టాటా మరణం పారిశ్రామికరంగానికి, దేశానికి తీరని లోటు అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, మేకిన్ ఇండియా నినాదంతో ముందుకు సాగిన టాటా ప్రయాణం చిరస్మరణీయం అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.