Minister Uttam Kumar Comments on BRS, BJP :గత పదేళ్లలో ఎంపీలకు నిరసన తెలిపే హక్కు కూడా లేదని, పార్లమెంటులో విపక్ష ఎంపీలు మాట్లాడితే వెంటనే సస్పెండ్ చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆధారాలు, ఛార్జిషీట్, విచారణ లేకుండానే విపక్ష నేతలను జైల్లో పెట్టారని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రికే పరిస్థితి ఇలా ఉంటే, సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.
ఈ మేరకు మీట్ ది ప్రెస్ ప్రోగ్రాంలో పాల్గొని ప్రసంగించిన ఆయన, కేంద్ర సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలనే కాకుండా మీడియా సంస్థలను కూడా బెదిరించారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని నిలదీస్తే వెంటనే ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలు పంపించి బెదిరిస్తారని చెప్పుకొచ్చారు. సాక్షాత్తు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రెస్‌మీట్ పెట్టి మరీ పరిస్థితి ఎలా ఉందో వివరించారన్నారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం, వాక్ స్వేచ్ఛ ప్రమాదంలో పడిందన్నారు.
ఆర్థిక విధానాల్లోనూ మోదీ సర్కార్ పూర్తిగా విఫలం :ఆర్థిక విధానాల్లోనూ మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. 70 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం 40 శాతానికి ఎగబాకిందన్నారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో పేదలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వివరించారు. గత బీఆర్ఎస్ పాలనలో రైతులు ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి, ఇవ్వకుండా రైతులను తీవ్రంగా నష్టపరిచారన్నారు. కేంద్రంలో రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా నల్ల సాగుచట్టాలు తెచ్చారని దుయ్యబట్టారు.
"బీజేపీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్య విషయంలో ఖూనీ జరుగుతుంది. మరోసారి మోదీ ప్రధాని అయితే పాకిస్థాన్, రష్యా, నార్త్ కొరియాలా దేశం తయారవుతుంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులపైనే ఈడీ, సీబీఐ దాడులు జరిపి, భయపెడుతుంటే ఇక సామాన్యుల సంగతేంటో మీరే ఆలోచన చేయండి." - ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి