Minister Tummala On Farmers Schemes :రైతులంటే అందరికీ దానం చేసే జాతి అని, వాతావరణానికి అనుగుణంగా అన్నదాతలు పంటలు పండించాలని స్టేట్ అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో జరిగిన రైతు పండుగ వేదికగా మంత్రి తుమ్మల మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మహబూబ్‌నగర్‌కు జీవనాడిగా అభివర్ణించారు. పాలమూరుకు వలసల జిల్లా అనే పేరు ఉందని, ఇకపై పాలమూరుకు వేరే ప్రాంతాల నుంచి వలసలు రావాలని కోరారు. ఇక్కడి నుంచి వెళ్లకూడదన్న ఆయన, రైతులకు ఎన్ని బాధలున్నాయో.. ప్రభుత్వానికి అన్ని సమస్యలున్నాయని పేర్కొన్నారు. వచ్చే నాలుగేళ్లలో మహబూబ్‌నగర్‌లోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇరిగేషన్ ప్రణాళిక రూపొందించాల్సి ఉందని, రాష్ట్రానికి పెట్టుబడి పెట్టే జిల్లా మహబూబ్‌నగర్ కావాలని ఆకాంక్షించారు.
బోనస్ తీసుకున్న రైతులు ఆనందంగా ఉన్నారన్న మంత్రి, బోనస్ వల్ల రైతుకు రూ.12 వేల నుంచి రూ.15వేలు వస్తున్నాయని స్పష్టంచేశారు. బోనస్ వల్ల కష్టపడే రైతులకే ఫలితం దక్కుతుందని, రైతుబంధు కంటే బోనస్ బాగుందని కొందరు రైతులు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ఒకానొక సందర్భంలో రైతుబంధు కాదు, బోనస్ ఇవ్వాలని రైతులు అంటున్నారని పలికారు. రైతుల అనుభవాల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటామన్న ఆయన, రైతుకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. అన్నదాతలు తమకు ఏ పథకం మంచిదో చెబితే, ఆ స్కీములనే కొనసాగిస్తామని అన్నారు. అన్నీ చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పమన్న తుమ్మల, అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని రైతులను ఆశలు పల్లకిలో ఊరేగించమని పునరుద్ఘాటించారు. న్యాయంగా, ధర్మంగా ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తామని మంత్రి తుమ్మల అన్నారు.