Minister Ponnam Comments on HYDRA : అక్రమాలను అడ్డుకోవాలంటే హైడ్రా లాంటి శాఖలే అవసరం లేదని, రాష్ట్రంలో ప్రజా పాలన నడుస్తోందని, ఏ అక్రమమైనా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లో జరిగిన క్రీడా దినోత్సవంలో పాల్గొన్న మంత్రి, విద్యార్థుల సంఖ్య మరింత పెంచాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. పాఠశాలలో సదుపాయాల కల్పనకు రూ.25 లక్షలు మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చారు.
ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, హైదరాబాద్‌లో హైడ్రా ఏర్పడక ముందే కరీంనగర్లో జరుగుతున్న భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపామని, ప్రజలు ఇప్పటికైనా అక్రమాలు తమ దృష్టికి తీసుకొస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. అధికారికంగా సమాచారం లభించకపోయినా సమాచార హక్కు చట్టం ద్వారా పొంది ఫిర్యాదు చేయాలన్నారు. ఒకవేళ అధికారుల్లో స్పందన లేకపోతే తన దృష్టికి తీసుకురావచ్చన్నారు.
చెరువులు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించే ప్రసక్తి లేదన్నారు. అంతేకాకుండా ఎక్కడైనా గంజాయి, మత్తు పదార్థాలు విక్రయిస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించిన విషయం గుర్తు చేశారు. అలాంటి సమాచారం ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.
క్రీడాకారులకు ప్రోత్సాహకాలు : మరోవైపు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎవరైనా రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొంటే రూ.50 వేల నగదు, జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొంటే రూ.లక్ష బహుమతిని వ్యక్తిగతంగా ప్రోత్సాహంగా అందిస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూల వేసి మంత్రి నివాళులు అర్పించారు.
అనంతరం క్రీడా పోటీలను ప్రారంభించి, కాసేపు క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి క్రీడల్లో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులు కరీంనగర్‌లోని స్పోర్ట్స్ స్కూల్లో అడ్మిషన్ తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. తల్లిదండ్రులకు, పుట్టిన ప్రాంతానికి పేరు తీసుకురావాలంటే విద్యార్థులు ఏదో ఒక రంగంలో నైపుణ్యాన్ని సాధించాలన్నారు. హుస్నాబాద్‌ను రాష్ట్రస్థాయిలో నెంబర్ వన్ క్రీడా హబ్‌గా మార్చడమే తన లక్ష్యమని తెలిపారు. హుస్నాబాద్ మినీ స్టేడియంలో అన్ని రకాల క్రీడా వసతులు కల్పిస్తున్నామని, విద్యార్థులు, క్రీడాకారులు ఇక నుంచి హుస్నాబాద్ మినీ స్టేడియంలోనే క్రీడలు ఆడుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. అదేవిధంగా అందరూ ఈత నేర్చుకోవడానికి మినీ స్టేడియంలో స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
'ఇప్పుడు రాజధాని, తర్వాత అన్ని జిల్లాల్లో కూల్చివేతలు - అక్రమంగా కడితే వదిలేది లేదు' - Ponnam On Hydra project
ఎవరైతే మాకేంటి? - సీఎం సోదరుడికి 'హైడ్రా' షాక్ - నెలలోగా ఇల్లు కూల్చేయాలని అల్టిమేటమ్ - Hydra Notices To CM Revanth Brother