Minister Ponguleti Srinivas Reddy On Dharani Problems :ధరణి సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడే విషయంలో తానైనా, తనకుటుంబ సభ్యులైనా చట్టం తన పని తాను చేసుకుంటూపోతుందని ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీయైనా ప్రభుత్వ ఆస్తులు విషయంలో ఒకే విధమైన చర్యలు ఉంటాయని ఈ దూకుడు మూణ్నాళ్ల ముచ్చట అసలే కాదని ప్రభుత్వం నిరంతరం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.
హైడ్రా పనితీరును మంత్రి శ్రీనివాసరెడ్డి ప్రశంసించారు. ఇదే రీతిలో జిల్లా కేంద్రాల్లో కూడా ఇలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించేందుకు కొత్త ఆర్వోఆర్ చట్టం తీసుకొచ్చామన్నారు. రెండు మండలాల్లో ఫైలట్ ప్రాజెక్టు చేపట్టామని చెప్పారు. అక్కడున్న ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ ఆధారంగా సమర్థమైన చట్టాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదు :స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ శాఖలో అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఇస్తే దానిని దుర్వినియోగం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని పొంగులేటి తేల్చి చెప్పారు. ఏసీబీ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారం నిబంధనలకు లోబడే ఉంటుందని, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే రీతిలో చర్యలు ఉండవని అన్నారు. నిర్దేశించిన మూడు నెలల్లో వాటిని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.