Minister Nara Lokesh Fires on YS Jagan : శాంతిభద్రతల గురించి జగన్ మాట్లాడడం సిగ్గుచేటు అని మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. వైఎస్సార్సీపీ పునాదులే నేరాలు - ఘోరాలు అని మీ కుటుంబ సభ్యులే చెప్పారని, నీ పాలనలో వేల మంది చనిపోయినా, ఏ నాడు ఒక్క మాట, కనీసం ఒక్క సమీక్ష కూడా చేయని నువ్వు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతుండటం మా ఖర్మ అని ధ్వజమెత్తారు.
5 ఏళ్ల పాటు గంజాయి, డ్రగ్స్ ని వ్యాప్తి చేసి సొమ్ము చేసుకున్నావ్ అని, ఊరికో ఉన్మాదిని పెంచి పోషించి ప్రజల మీదకు వదిలారని విమర్శించారు. నేరస్తులు ఇష్టం వచ్చినట్లు బతికే లైసెన్స్ ఇచ్చారని, మహిళలను వేధించిన వారిని అందలం ఎక్కించారన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాళ్లకు టికెట్లు ఇచ్చారని, శాంతిభద్రతల గురించి జగన్ మాట్లాడటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.
"1. నీ 5 ఏళ్ల పాలనలో 2,027 మంది మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారు. ఏ నాడైనా, ఒక్క మహిళ దగ్గరకు వెళ్లి పరామర్శ చేసావా ? కనీసం ఒక్కసారైనా ఖండించావా ? ఒక్కసారైనా సమీక్ష చేసావా ?
2. నీ పాలనలో కోనసీమ జిల్లాలో 12 ఏళ్ల బాలికపైన ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు. విజయవాడలో యువతిని 11 కత్తిపోట్లు పొడిచి చంపారు. నీ ఇంటి సమీపంలోని సీతానగరంలో యువతిపై అత్యాచారం జరిగితే కనీసం స్పందించలేదు. నీకు అసలు మాట్లాడే అర్హత ఉందా జగన్ ? ఇలాంటి ఘటనలు కొన్ని వందలు ఉన్నాయి.
3. నీ 5 ఏళ్ల పాలనలో, నీ ముఠా మొత్తం ఎస్సీ, ఎస్టీలపై ఇష్టానుసారంగా దాడులకు తెగబడ్డారు. ఎస్సీలు 192 మంది, ఎస్టీలు 58 మంది హత్యకు గురయ్యారు. మైనార్టీలపైనా దాడులకు పాల్పడ్డారు. అబ్దుల్ సలాం కుటుంబ ఘటన కంటే ఘోరమైన సంఘటన రాష్ట్రంలో మరొకటి ఉంటుందా. నరసరావుపేటలో వక్ఫ్ ఆస్తులు కాపాడాలని కోరిన ఇబ్రహీంను నడిరోడ్డుపై చంపారు. పలమనేరులో మిస్బా అనే 10వ తరగతి విద్యార్థిని బాగా చదువుతుంది. వైఎస్సార్సీపీ నేత కుమార్తె కంటే చదువులో ముందంజలో ఉందని వేధించడంతో ఆత్మహత్య చేసుకుంది. మైనారిటీ ఆడబిడ్డ కష్టపడి చదువుకోవడానికి కూడా స్వేచ్ఛ లేకుండా చేశారు. నువ్వు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావా జగన్ ?
4. దిశ చట్టం అంటూ లేని చట్టాన్ని ఉన్నట్లు ప్రచారం చేస్తున్నావ్. దిశ చట్టంలో లోపాలున్నాయని కేంద్రం తిప్పి పంపితే, ఇక ఆ తర్వాత మళ్లీ దాని గురించి పట్టించుకోలేదు. లేని చట్టం పేరుతో పోలీస్ స్టేషన్లు పెట్టి యాప్ డౌన్లోడ్ చేయించారు. ఆడబిడ్డలపై అత్యాచారం చేస్తే దిశ చట్ట ప్రకారం ఉరిశిక్ష వేస్తామని చెప్పిన వ్యక్తి ఒక్కరికైనా వేశారా? ఎందుకీ అబద్ధపు బ్రతుకు జగన్ ?