Minister Nara Lokesh Fire On Police Behavior :రాష్ట్రంలో ప్రభుత్వం మారిన పోలీసు శాఖ తీరు మాత్రం ఇంకా మారలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అవలంభించిన తీరునే ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా కొనసాగిస్తున్నారు. తన పర్యటనలో పరదాల సంస్కృతిని మానుకోవాలని, సామాన్యులను ఇబ్బంది పెట్టే చర్యలకు ముగింపు పలకాలని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నా "మేమింతే.. మా తీరింతే" అనే విధంగా వ్యవహరించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
గురువారం చంద్రబాబు శ్రీశైలం, మడకశిరలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులను నిలిపివేయడం, సీపీఎం నేతలను పోలీసులు గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టు చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నేతలను అరెస్టు చేసినందుకు మన్నించాలని నారా లోకేశ్ కోరారు. ఈ మేరకు 'ఎక్స్'లో ఆయన పోస్టు పెట్టారు.
వైఎస్సార్సీపీ కుట్రలపై నూతన డీజీపీ కన్ను వెయ్యాల్సిందే! - HarishKumarGupta on Police Behavior
సీఎం శ్రీశైలం పర్యటన :ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం పర్యటనలో పోలీసు శాఖ తీరుపై ప్రభుత్వ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సీఎం పర్యటన పేరుతో ప్రకాశం జిల్లా దోర్నాలలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత, సీపీఎం నేతల అరెస్ట్‌పై విస్మయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే జిల్లా అధికారుల నుంచి వివరణ కోరినట్లు తెలుస్తోంది. పోలీసుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.