Minister Bhatti on Dwakra Loans : మహిళల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి (Minister Bhatti) విక్రమార్క పేర్కొన్నారు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన పాలక మండలి సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి భట్టి మాట్లాడుతూ ఇందిరా క్రాంతి పథకం కింద తెలంగాణ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు అందిస్తామని స్పష్టం చేశారు.
గత నాలుగేళ్లుగా ఐటీడీఏలో(ITDA Bhadrachalam) పాలకమండలి సమావేశం జరగలేదని, ఇప్పటి నుంచి ప్రతి మూడు నెలలకోసారి సమావేశం జరుగుతుందని భట్టి తెలిపారు. ఈ సమావేశంలో గిరిజనులకు విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి మొదలగు వాటిని మెరుగుపరిచే విధంగా అధికారులకు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగిందన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం, వంట కార్మికులకు, ఆశా కార్యకర్తలకు సరైన సమయంలో వేతనాలు పడటం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. వీటన్నింటిపై అధికారులతో చర్చించి పరిష్కరిస్తామన్నారు.
తెలంగాణ అభివృద్దికి మెగా మాస్టర్ ప్లాన్ - 2050 విజన్ దిశగా ముందుకు : సీఎం రేవంత్రెడ్డి
ITDA Council meet Bhadrachalam :భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు రవాణా మార్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని, జాతీయ రహదారి విస్తరణ పనులు త్వరలో చేపట్టనున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Minister Komatireddy) పేర్కొన్నారు. భద్రాచలం సీతారాముల ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. భద్రాచలం పట్టణంలో వరద నివారణకు త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. భద్రాచలం సమస్యలు మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య తమ దృష్టికి తెచ్చారని, వాటన్నింటినీ త్వరతగతిన పూర్తి చేస్తామన్నారు.