Telugu Film Celebrities in Politics : రాజకీయాల్లోకి వచ్చిన అనతి కాలంలోనే ఎంతో మంది సినీ ప్రముఖులు ఎన్నికల్లో విజయాలు అందుకున్నారు. మరికొందరు ఓ సారి ఓడినా ఆ వెంటనే గెలుపు బాటలో పయనించారు. వారి విజయం వెనుక లక్షలాది అభిమానులు, వేలాది అభిమాన సంఘాలు వెన్నంటి నిలిచాయి. పార్లమెంటులో అడుగిడిన తొలి తెలుగు నటుడు కళావాచస్పతి కొంగర జగ్గయ్య. ఆయన చూపిన బాటలో మరికొందరు రాజకీయాల్లోకి ప్రవేశించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు రాజకీయాల్లో అత్యున్నత శిఖరాలు అధిరోహించగా మరెందరికో ఆయన స్పూర్తి నిచ్చారు.
కొంగర జగ్గయ్య
లోక్‌సభకు ఎన్నికైన తొలి భారతీయ సినీనటుడు ఆయన. కళావాచస్పతి, కంచు కంఠం ఆయనకున్న ప్రత్యేకమైన బిరుదులు. నాటకం, సినిమా, జర్నలిజం, రాజకీయ రంగాల్లో వెలుగొందిన జగ్గయ్య 1967లో జరిగిన నాలుగో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించి పార్లమెంటులో అడుగుపెట్టారు. 1962లోనే ఆ అవకాశం వచ్చినా రాజకీయ నైతిక విలువలు పాటించి పోటీకి దూరంగా ఉన్న గొప్ప వ్యక్తి జగ్గయ్య. నటుడిగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమ కష్టసుఖాలు తెలిసిన జగ్గయ్య విజయంతో సినీ పరిశ్రమ ఉత్సాహంతో ఉప్పొంగి పోయింది.
దాసరి నారాయణరావు
సందేశాత్మక చిత్రాల సృష్టికర్త దాసరి నారాయణరావు. నటుడిగా, దర్శకుడిగా, రచయిత, నిర్మాతగా రాణించిన దాసరి రాజకీయాల్లోనూ తనదైన చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. అత్యధిక చిత్రాల (150) దర్శకుడుగా గిన్నిస్ పుటలకెక్కిన దాసరి రాజకీయాల్లో చేరి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 1990 దశకం చివరిలో 'తెలుగు తల్లి' పార్టీని స్థాపించినప్పటికీ చివరికి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ఎన్నికై కేంద్రమంత్రిగా పని చేశారు. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీకి సన్నిహితుడు మన దాసరి.
రావు గోపాలరావు
సినిమాలో చప్పట్లు కొట్టేంతగా ఐదైనా పాత్రను పోషిస్తే గొప్ప నటన అంటారు. కానీ పరకాయ ప్రవేశం చేయడం ద్వారా ఆ పాత్రలో జీవించడం కేవలం రావు గోపాలరావు కే సాధ్యం. 'పైనేదో మర్డర్ జరిగినట్టు లేదూ ఆకాశంలో సూరీడూ నెత్తురు గడ్డలా లేడూ, మడిసన్నాక కాసింత కళాపోషణ ఉండాలయ్యా, ఉత్తినే తిని తొంగుంటే మనిషికి, గొడ్డుకి తేడా ఏటుంటాది?' ఇలా గోదావరి యాసలో సుదీర్ఘమైన డైలాగులతో సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు రావు గోపాలరావు. తెలుగుదేశం పార్టీలో చేరిన రావు గోపాల్ రావు ఎమ్మెల్సీగా, ఎంపీగా దేశ, రాష్ట్ర రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించారు. 1984-85 వరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా, 1986-1992వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.
ఘట్టమనేని కృష్ణ
'మోసగాళ్లకు మోసగాడు', 'గూఢచారి' సూపర్ స్టార్ కృష్ణ పార్లమెంట్ సభ్యుడిగానూ సేవలు అందించారు. 1989లో జరిగిన 9వ లోక్‌సభ ఎన్నికల్లో ఏలూరు కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం దక్కించుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అదే ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. మరో సినీ నటుడు మురళీ మోహన్ క్లాస్మేట్ అయిన కృష్ణ తాను బీఏ చదువుతున్న రోజుల్లో ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన సన్మానం, ప్రజాదరణ సినిమాల్లోకి వెళ్లాలన్న ప్రేరణ కలిగించింది. అప్పట్లో కృష్ణకు రికార్డు స్థాయిలో 2500 అభిమాన సంఘాలు ఉన్నట్లు సమాచారం.
కృష్ణం రాజు
రెబల్ స్టార్ కృష్ణంరాజు కాకినాడ, నర్సాపురం ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టారు. 1998లో జరిగిన 12వ లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున కాకినాడ ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 1999లో 13వ లోక్‌సభకు ఎన్నికై అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా స్థానం సంపాదించారు. 2009లో బీజేపీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరిన కృష్ణంరాజు రాజమండ్రి నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు.
జమున
ఎన్టీఆర్, ఏఎన్నార్ హీరోగా నటించిన చాలా సినిమాల్లో ఆమె హీరోయిన్. చిన్నతనంలోనే నాటకాల్లో రాణించిన జమున స్వస్థలం కర్ణాటక అయినా తెలుగు చిత్రాల్లో నటించి గుర్తింపు దక్కించుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిక ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన జమున రాజమండ్రి ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టారు. 1989 సంవత్సరంలో జరిగిన 9వ లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిపై విజయం సాధించిన జమున తిరిగి 1991లో టీడీపీ అభ్యర్థిపై ఓటమి పాలయ్యారు. సూపర్‌స్టార్ కృష్ణ, జమున ఒకేసారి పార్లమెంటులో అడుగుపెట్టడం విశేషం.
కైకాల సత్యనారాయణ
సినీరంగంలో ఆయన నవరస నటనా సార్వభౌముడు. చదువే తనకు ముఖ్యమని డిగ్రీ చదివే రోజుల్లోనే సినీ రంగంలో వచ్చిన అవకాశాన్ని వదులుకున్నారు కైకాల సత్యనారాయణ. కానీ, తిరిగి సినీ అవకాశాల కోసం ఎదురుచూస్తూ 15రోజుల పాటు పార్కులోనే గడిపాల్సి రావడం విశేషం. కైకాల సత్యనారాయణ మచిలీపట్నం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా ఎన్నికై ప్రజా సేవలో పాల్గొన్నారు. 1996లో జరిగిన 11వ లోక్‌సభ ఎన్నికల్లో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికయ్యారు. తిరిగి 1998లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ అవకాశం దక్కినా కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.
మురళీ మోహన్
తెలుగు సినిమా కథానాయకుడు మాగంటి మురళీమోహన్ టీడీపీ తరఫున రాజమండ్రి ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టారు. మురళీ మోహన్ పూర్వ నామం రాజబాబు. తెలుగుదేశం పార్టీ విధానాలకు ఆకర్షితుడైన మురళీ మోహన్ ఆ పార్టీలో చేరడం ద్వారా రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేశారు. అనతి కాలంలోనే 2009లో జరిగిన 15వ లోక్‌సభ ఎన్నికల్లో రాజమండ్రి లోక్‌సభ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండవల్లి అరుణ కుమార్ చేతిలో స్వల్ప తేడా (2,147 ఓట్లు)తో పరాజయం పాలయ్యారు. తిరిగి 2014లో టీడీపీ తరఫున ఎన్నికై పార్లమెంటులో అడుగు పెట్టారు.