Bitter Gourd Fry Recipe in Telugu : కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ, చాలా మంది చేదు అనే కారణంతో దీన్ని అంతగా తినడానికి ఇష్టపడరు. ముఖ్యంగా పిల్లలైతే కాకరకాయ కర్రీనా అంటూ మొహం చిట్లించుకుంటుంటారు. మీ పిల్లలు ఆ జాబితాలో ఉన్నారా? అయితే, ఓసారి ఇలా "కాకరకాయ ఫ్రై" చేసి పెట్టండి. అస్సలు చేదు ఉండదు! పైగా టేస్ట్ అద్దిరిపోతుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు. దీన్ని కొత్తగా వంట చేసే వారు, బ్యాచిలర్స్‌తో పాటు ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- కాకరకాయలు - అరకిలో
- నూనె - 4 టేబుల్‌స్పూన్లు
- శనగపప్పు - 1 టీస్పూన్
- మినప్పప్పు - 1 టీస్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- ఆవాలు - 1 టీస్పూన్
- ఉల్లిపాయ - 1(సన్నగా తరుక్కోవాలి)
- కరివేపాకు - 1 రెమ్మ
- పసుపు - పావుటీస్పూన్
- ఉప్పు - కొద్దిగా
వెల్లుల్లి కారం కోసం :
- వెల్లుల్లి రెబ్బలు - 6
- జీలకర్ర - అరటీస్పూన్
- కారం - 1 టేబుల్‌స్పూన్
- ఉప్పు - కొద్దిగా
తయారీ విధానం :
- ముందుగా కాకరకాయలను చాకు లేదా పీలర్ సహాయంతో వాటిపై ఉండే చెక్కును తొలగించుకోవాలి. ఆ తర్వాత చెక్కు తీసిన కాకరకాయలను మధ్యలోకి కట్ చేసి ఆపై వాటిని నిలువుగా చీల్చి లోపల ఉన్న గింజల భాగాన్ని తొలగించాలి.
- ఆ తర్వాత వాటిని క్యూబ్స్ మాదిరిగా చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోవడం వల్ల కాకర ముక్కలు చక్కగా వేగి కర్రీ చాలా రుచిగా ఉంటుంది.
- తదుపరి ఆవిధంగా కట్ చేసుకున్న ముక్కలను ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు వేసి బాగా కోట్ చేసి అరగంట పాటు అలా వదిలేయాలి.
- అనంతరం ఉప్పులో ఊరిన కాకరకాయ ముక్కల్ని తీసుకొని చేతితో గట్టిగా పసరు పిండి మరో బౌల్లో వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ ప్రాసెస్ ద్వారా చేదు చాలా వరకు తగ్గిపోతుంది.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని తాలింపుని చక్కగా వేయించుకోవాలి.
- తాలింపు వేగాక సన్నని ఉల్లిపాయ తరుగు, కరివేపాకు, పసుపు వేసి కలిపి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి.
- ఆవిధంగా వేయించుకున్నాక అందులో ముందుగా పసరు పిండి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకోవాలి.
- ఆపై పాన్ మీద మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద మధ్యమధ్యలో కలుపుతూ కాకరకాయ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. అందుకోసం 15 నిమిషాల దాకా సమయం పట్టొచ్చు.
- ఆలోపు వెల్లుల్లి కారం సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- కాకరకాయ ముక్కలు మంచిగా వేగాయనుకున్న తర్వాత.. ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకొని కలిపి మూతపెట్టకుండా మరో 10 నుంచి 15 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. అంతేకానీ, మరీ నల్లగా వేయించుకోవద్దు.
- ఆవిధంగా వేయించుకున్నాక మీకు నచ్చితే ఒక చెంచా చక్కెర వేసుకొని కలిపి దింపేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే కమ్మని "కాకరకాయ ఫ్రై" రెడీ!
ఇవీ చదవండి :
కాకరకాయ తినలేకపోతున్నారా? - ఇలా "కాకర ఉల్లికారం" ప్రిపేర్ చేయండి - ప్లేట్ మొత్తం పక్కా ఖాళీ!
10 నిమిషాల్లోనే కమ్మటి "వెజిటబుల్ మసాలా రైస్ " - పిల్లలకు ఇష్టమైన రెసిపీ