మహబూబ్‌నగర్‌లో ఎన్నికల హీట్ - 2ఎంపీ సీట్లపై ప్రధానపార్టీల ఫోకస్ Mahabubnagar Lok Sabha Elections 2024: ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లు ప్రతిసవాళ్లతో ప్రధాన పార్టీలు కాక పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలూ పాలమూరు జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ స్థానాలను గెలుచుకోవడాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ 2 స్థానాలను ఎలాగైనా గెలుచుకోవాలని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే పలుమార్లు సీఎం జిల్లాలో కాంగ్రెస్ బహిరంగ సభలకు హాజరయ్యారు.
Political War in Mahabubnagar 2024: మహబూబ్‌నగర్ అభ్యర్ధి చల్లా వంశీచంద్ రెడ్డి, నాగర్‌కర్నూల్ అభ్యర్ధి మల్లు రవి ప్రతి మండలం తిరుగుతూ ఓటర్లను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, పెండింగ్ ప్రాజెక్టులు, ముదిరాజులను బీసీ డీ నుంచి ఎకు మార్చడం, వాల్మీకి బోయల్ని ఎస్టీ జాబితాలో చేర్చడం, ఎస్సీ వర్గీకరణ సహా పలు అంశాల్ని కాంగ్రెస్ ప్రచారాస్త్రాలుగా సంధిస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్లపై విమర్శలు ఎక్కుపెడుతూనే ఎక్కడి సమస్యల్ని అక్కడ ప్రస్తావిస్తూ వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీలు గుప్పిస్తున్నారు.
ప్రచారంలో కేంద్ర మంత్రులు :బీజేపీ కూడా పాలమూరు జిల్లాలోని 2 స్థానాలపై ఆశలు పెట్టుకుంది. ఏ ఎన్నికలు జరిగినా పాలమూరు నుంచే ప్రచారం ప్రారంభించే బీజేపీకు పదేళ్లుగా ఎన్నికల్లో ఎక్కడా ఊరట లభించలేదు. ఈసారి మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాలను ఎలాగైనా గెలిచి తీరాలని ఆ పార్టీ అభ్యర్ధులు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సహా పలువురు కేంద్ర మంత్రులు ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ప్రచారాల్లో పాల్గొన్నారు.
రాష్ట్రంలో 14 ఎంపీలను గెలిపించి సోనియమ్మకు కానుకగా ఇద్దాం : సీఎం రేవంత్ - Lok Sabha Polls 2024
మహబూబ్‌నగర్‌లో బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగిన డీకే అరుణ గత లోకసభ ఎన్నికల్లోనూ అదే ప్రత్యర్థులతో తలపడి రెండో స్థానంలో నిలిచారు. ఈసారి గెలిచి తీరాలని కంకణం కట్టుకుని రేయింబవళ్లూ శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న అభ్యర్ధి కన్నా ముఖ్యమంత్రి నుంచే నేరుగా విమర్శలు ఎదుర్కొంటున్న అరుణ రేవంత్ రెడ్డికి దీటుగా సమాధానాలిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక నాగర్‌కర్నూల్ బీజేపీ అభ్యర్ధి భరత్ ప్రసాద్ పదేళ్ల మోదీ పాలన, జరిగిన అభివృద్ధి, ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీసుకొచ్చిన జాతీయ ప్రాజెక్టులు, గతంలో పాలమూరుకు తాము చేసిన అభివృద్ధి పనులనే ప్రచారాస్త్రాలుగా సంధిస్తున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారం :బీఆర్ఎస్ కూడా రెండు సిట్టింగ్ స్థానాలపై ప్రధాన దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే కేటీఆర్ అలంపూర్‌లో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరై శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ఈ నెల 26, 27 తేదీల్లో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల్లో బస్సు యాత్రలో పాల్గొననున్నారు. పదేళ్లలో మోదీ సర్కారు వైఫల్యాలు, హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యాలు, పదేళ్ల కేసీఆర్ పాలనలో సాధించిన ప్రగతి గురించి తెలియజేస్తూ బీఆర్ఎస్ ప్రచారం నిర్వహిస్తోంది.
మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్ధి మన్నె శ్రీనివాస్ రెడ్డి, నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్ధి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల సన్నాహక సమావేశాలు, బహిరంగ సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారంలో వేగాన్ని పెంచారు. మొత్తంగా పాలమూరు రాజకీయం వివిధ అంశాల చుట్టూ తిరుగుతోంది. పాలమూరు రంగారెడ్డికి జాతీయహోదా, జాతీయ రహదారులు, పెండిగ్ రైల్వే ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఎస్సీ వర్గీకరణ ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయి.
'మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌కు ఓటమి భయం పట్టుకుంది - అందుకే గుంపులుగా వచ్చి నాపై ముప్పేట దాడి' - DK Aruna Fire on CM Revanth
నాలుగున్నర నెలల కాంగ్రెస్ పాలన మొత్తం తిట్లు - దేవుడి మీద ఒట్లతోనే సరిపోయింది : హరీశ్‌రావు - Lok Sabha Elections 2024