Mahabubnagar By MLC Election 2024 :మహబూబ్‌నగర్ స్థానికసంస్థల మండలి ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో, పాలమూరులో ప్రధానపార్టీలు రంగంలోకి దిగాయి. ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించిన కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిచి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక వచ్చింది. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి 2028 జవనరి 4 వరకు ఎమ్మెల్సీగా కొనసాగుతారు. పూర్వ మహబూబ్‌నగర్‌కు 2021 నవంబరులో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో 2స్థానాలకు నోటిఫికేషన్ పడింది.
అప్పుడూ ఉమ్మడి జిల్లా నుంచి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో బీఆర్ఎస్(BRS Party) అధికారంలో ఉండటం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అదే పార్టీకి చెందిన వారు కావడంతో, ఇతర పార్టీల అభ్యర్థులు పోటీకి ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం మారింది. కాంగ్రెస్ రావడంతో ఉపఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీలన్ని ఉపఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించాయి.
ఎమ్మెల్సీ పదవికి ఆశావహుల పోటీ : మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం పూర్వ మహబూబ్‌నగర్‌లోని 14నియోజకవర్గాల్లో ఎన్నికైన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పురపాలిక కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటర్లుగా ఉంటారు. 2021లో 1,445 మంది ఓటర్లు ఉన్నారు. స్థానిక సంస్థల పదవీకాలం ముగియకపోవడం వల్ల, ప్రస్తుతం వారే ఓటర్లుగా ఉండనున్నారు. అప్పట్లో 1,039మంది బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి 241 మంది ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి 119 మంది ఉండగా ఇతరులు 46 మంది ప్రజాప్రతినిధులుగా ఉన్నారు.
తెలంగాణలో 9 మంది బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన - మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్ పోటీ
అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది పార్టీలు మారారు. రాష్ట్రంలో కాంగ్రెస్(Congress Govt) అధికారంలోకి వచ్చాక, మరికొందరు హస్తంగూటికి చేరారు. ఈ నేపథ్యంలో ప్రధానపార్టీల బలాబలాలు మారిపోయాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉండనుంది. భారతీయ జనతా పార్టీకి ఓటుబ్యాంకు తగినంత లేకపోవడంతో ఆ పార్టీ నుంచి అభ్యర్థిని పోటీలో నిలుపుతారా? లేక ఏదైనా పార్టీకి అంతర్గత మద్దతు ఇస్తారా? అనేది తేలాల్సి ఉంది.