Machilipatnam Janasena MP Candidate : తెలుగుదేశం, బీజేపీతో పొత్తులు, పోటీ చేసే సీట్ల వివరాలు ఖరారైన నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభ్యర్థుల ఎంపికను కొలిక్కి తెస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లోని అభ్యర్థుల్ని ప్రకటించారు. ఈ క్రమంలో గతంలో ఒక ఎంపీ లోక్సభ అభ్యర్థిని ప్రకటించగా తాజాగా పవన్ మరో ఎంపీ అభ్యర్థిని(Janasena MP Candidate) ప్రకటించారు. మచిలీపట్నం లోక్సభ జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరు ఖరారైంది. బాలశౌరిని అభ్యర్థిగా ఖరారు చేస్తూ పార్టీ అధినేత పవన్ కల్యాణ్నిర్ణయం తీసుకున్నారు.
BJP Janasena TDP alliance : తెలుగుదేశం, బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 శాసన సభ స్థానాలు, 2 లోక్ సభ స్థానాలకు పోటీ చేస్తోంది. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్ పేరు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు మచిలీపట్నం నుంచి సిటింగ్ ఎంపీ బాలశౌరికి అవకాశం కల్పించారు. అసెంబ్లీ స్థానాల్లో(AP Assembly Elections) అవనిగడ్డ, పాలకొండ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అవనిగడ్డ నుంచి పోటీకి ఆశావహులు ఎక్కువ మంది ఉన్న నేపథ్యంలో అక్కడ సర్వే జరుగుతోంది. సర్వే ఫలితాలను బట్టి అభ్యర్థిని ప్రకటిస్తామని జనసేన వర్గాలు తెలిపాయి.
మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాయలసీమను మరచిపోవాల్సిందే : పవన్ కల్యాణ్
మిగిలిన స్థానాలకు గట్టిపోటీ :ఇంకా ప్రకటించాల్సిన 3 స్థానాల్లో గట్టి పోటీనే ఉంది. అవనిగడ్డలో బండ్రెడ్డి రామకృష్ణ, చిలకలపూడి పాపారావుతో పాటు ఓ ప్రవాసాంధ్రుడు ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. విశాఖపట్నం దక్షిణ స్థానం కోసం కూడా జనసేనలో ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్నారు. చెన్నుబోయిన వంశీకృష్ణ యాదవ్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఆయనకు ఇప్పటికే పవన్ వ్యక్తిగతంగా చెప్పి ఎన్నికల నియమావళి పత్రాలను అందజేశారు. అక్కడున్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఇంకా అధికారికంగా ప్రకటించ లేదు.