Lok Sabha Elections Nominations :ఎన్నికల సమరంలో కీలకఘట్టమైన నామినేషన్ల పర్వం చివరి దశకు చేరుకుంది. ఈ నెల 25న గడువు ముగియనుండగా ఆలోగా అన్ని స్థానాల్లో అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఖమ్మం లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించనప్పటీకి ఆ పార్టీకి చెందిన నేత రెండు సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు.
రామసహాయం రఘురాంరెడ్డి తరఫున కాంగ్రెస్ నేతలు విడివిడిగా నామపత్రాలు సమర్పించారు. ఖమ్మం రిటర్నింగ్ అధికారి గౌతమ్‌కు కాంగ్రెస్ నేతలు బొర్రా రాజశేఖర్, స్వర్ణకుమారి ఆధ్వర్యంలో ఓ నామపత్రం ఇవ్వగా నూకల నరేశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో మరో నామపత్రం సమర్పించారు. ఖమ్మం స్థానానికి కాంగ్రెస్ తమ అభ్యర్థిని ఇంత వరకు అధికారికంగా ప్రకటించనప్పటికీ రఘురాంరెడ్డి తరఫున నామపత్రాలు దాఖలు చేయటంతో ఆయనకే టికెట్ ఖరారు కావచ్చని తెలుస్తోంది.
నామినేషన్ దాఖలు చేసిన గడ్డం రంజిత్ :రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్‌సభ స్థానానికికాంగ్రెస్ పార్టీనుంచి పోటీ చేస్తున్న గడ్డం రంజిత్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి రాజేంద్రనగర్‌లోని రిటర్నింగ్ అధికారి శశాంకకు నామినేషన్ పత్రాలు అందజేశారు. తన నామినేషన్ లో రంజిత్ రెడ్డి ఆస్తులు, అప్పుల వివరాలు పేర్కొంటూ రిటర్నింగ్ అధికారికి అఫిడవిట్ సమర్పించారు. తన కుటుంబానికి 435.49 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు వెల్లడించారు. తనపై ఓ క్రిమినల్ కేసూ ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.
Cong MP Candidate Mallu Ravi Nomination :నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి నామినేషన్ వేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి రిటర్నింగ్ అధికారికి మల్లు రవి మూడో సెట్ నామినేషన్ పత్రాన్ని అందజేశారు. రుణమాఫీ అంశంలో సీఎం ప్రకటనపై బీఆర్ఎస్ నేతల విమర్శలను మంత్రి జూపల్లి తిప్పికొట్టారు.
"ఆగష్టు 15లోగా రైతు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా రేవంత్ అనే పద్ధతిలో బీఆర్ఎస్ నేత హరీశ్ రావు వ్యాఖ్యలు చేశారు. మేము ఆగష్టు 15లోగా రైతుల రుణమాఫీ తప్పకుండా చేస్తాం. ఈ ఎన్నికలు రెఫరెండంగా భావిస్తున్నట్లు సీఎం చెప్పారు"- జూపల్లి కృష్ణారావు, మంత్రి
BJP Boora Narsaiah Goud Nomination : భువనగిరి బీజేపీ అభ్యర్థిగా బూర నర్సయ్యగౌడ్ నామపత్రాలు దాఖలు చేశారు. భువనగిరి కలెక్టరేట్లోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. నర్సయ్య నామినేషన్ కార్యక్రమానికి విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌తో పాటు పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా భువనగిరిలో భారీ ర్యాలీ నిర్వహించారు. మోదీ హయాంలోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యపడుతుందన్న కేంద్ర మంత్రి జీ-20 సదస్సు వేళ పోచంపల్లి పట్టుచీరలకు ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తుచేశారు.