KTR Reacts On Tummala Statement on Rythu Bharosa : ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటాక బోడి మల్లన్న అన్నట్లుంది కాంగ్రెస్ పాలన అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నమ్మించి మోసం చేసిందని తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రైతు భరోసా, రుణమాఫీపై ఎన్నికల వేల గొప్పలు చెప్పిన సీఎం, ఇప్పుడు నేల చూపులు చూస్తున్నారని మండిపడ్డారు.
కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేమని కుండ బద్దలు కొట్టారని, రుణమాఫీ విషయంలోనూ ఇలాగే మోసం చేశారని వ్యాఖ్యానించారు. మంత్రి తుమ్మల దిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతన్నలను అయోమయానికి గురి చేస్తున్నాయన్న కేటీఆర్ వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టారని, ఇప్పుడు కౌలు రైతుకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 420 హామీల్లో ఒక్కో వాగ్దానాన్ని సీఎం పాతరేస్తున్నారన్నారు.
నమ్మించి మోసం చేస్తే ఊరుకోరు :తెలంగాణ రైతులు దేన్నైనా క్షమిస్తారు కానీ, నమ్మించి ద్రోహం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరన్న కేటీఆర్, గద్దెనెక్కాక గొంతుకోసిన వారిని అస్సలు వదిలిపెట్టరని వ్యాఖ్యానించారు. వెన్నుపోటుకు ముఖ్యమంత్రి మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.