KTR Comments On Caste Census In Telangana :కులగణన పూర్తిగా తప్పుల తడకగా, అశాస్త్రీయంగా ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. కులగణనలో ఐదున్నర శాతం జనాభాను తగ్గించారన్న కేటీఆర్ దాదాపు 22 లక్షల మంది ఉన్నవారిని లేనట్లుగా చిత్రీకరించారని కాంగ్రెస్ సర్కారుపై ధ్వజమెత్తారు. దీనిపై బీసీలకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కులగణన చిత్తు కాగితంలో సమానమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తగులబెట్టారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో బీసీ రిజర్వేషన్ కోసం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
కులగణనపై రీసర్వే చెసి లెక్కలు తేల్చాలి :కులగణనపై వెంటనే రీసర్వే చేసి లెక్కలు తేల్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రీసర్వే విషయంలో తాము కూడా చొరవ తీసుకుంటామని తెలిపారు. కులగణనలో కేసీఆర్, కేటీఆర్ పాల్గొలేదని ఆరోపిస్తున్నారన్న ఆయన స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారే పాల్గొనాలని తొలుత చెప్పారన్నారు. బీసీలకు అన్యాయం చేసి తప్పించుకునే ప్రయత్నం చేయవద్దని కేటీఆర్ కోరారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేసేదాకా వదిలిపెట్టమని కేటీఆర్ అన్నారు. బీసీలకు జరిగిన అన్యాయాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోతామన్నారు.
"బీసీల రిజర్వేషన్ కోసం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాము. బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం మోసం చేసింది. దీనిపై అసెంబ్లీలో ప్రశ్నిస్తాము. తప్పుల తడకగా ఉన్న కుల గణనను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాము. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డిలో డిక్లరేషన్ చేశారు. ఈ ప్రభుత్వం 15 లక్షల మంది బీసీలను తక్కువ చేసి చూపించారు. రీ సర్వేకు అదేశించి సరైన లెక్కలను తేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము." -కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు