KTR on Telangana Formation Day : భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ పాల్గొనాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆహ్వానించారు. ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ అంటే కేసీఆర్, బీఆర్ఎస్ అని పేర్కొన్నారు.
దశాబ్దాల స్వరాష్ట్రం కలను సాకారం చేసిన పార్టీగా బీఆర్ఎస్ నిలుస్తోందన్నారు. ఇందుకోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అమరణ నిరాహార దీక్ష చేసి అనేక పోరాటాలు, త్యాగాలతో తెలంగాణను సాధించుకున్న కేసీఆర్ ఆధ్వర్యంలో మూడు రోజుల కార్యక్రమాలను విజయవంతం చేద్దామని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను ఎక్కడికక్కడ ఘనంగా నిర్వహించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
జూన్ 1 : మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా జూన్ ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటలకు గన్ పార్క్‌లోని అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అమరజ్యోతి వరకు అమరవీరులకు నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారన్నారు. వారితో పాటు తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కానున్నట్లు చెప్పారు.
జూన్ 2 :జూన్ రెండో తేదీన పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఆవిర్భావ దినోత్సవ సంబురాలను నిర్వహించనున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఉదయం 9.30 గంటలకు జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాను పార్టీ అధినేత కేసీఆర్ ఎగరవేస్తారన్నారు. అనంతరం పార్టీ శ్రేణుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారని చెప్పారు.