KTR Comments on CM Revanth and PM Modi :లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క స్థానమైనా గెలవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌కు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు. ఇద్దరమూ రాజీనామా చేసి మల్కాజ్గిరి బరిలో నిలిచి తేల్చుకుందామని ఛాలెంజ్ చేశారు. ముఖ్యమంత్రి పదవికి, శాసనసభ్యత్వానికి రేవంత్ రాజీనామా చేయాలని, తానూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వ్యాఖ్యానించారు.
మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో ఘట్కేసర్ మండల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తల సమావేశంలో మాజీమంత్రి మల్లారెడ్డితో కలిసి పాల్గొన్న కేటీఆర్, ఈటలకు(Etela Rajender) ఓటు వేసినా ఇక్కడ ఉండరని, హుజురాబాద్‌కు వెళ్లిపోతారని అందుకే లోకల్ పార్లమెంట్ అభ్యర్థి రాగిడిని గెలిపించాలని కోరారు. ఉగాది పచ్చడిలో ఉన్న ఆరు రుచుల మాదిరి జీవితంలో కూడా అన్నీ ఉంటాయని, కొంత మంది నాయకులు పార్టీని వీడినా ఎటువంటి నష్టం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన ప్రధాన ప్రతిపక్షం బాధ్యతను సరిగ్గా నిర్వహిస్తున్నామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన ఖర్మ మాకు లేదు : కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామన్న ఆయన, 420 హామీలిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనిక్కి, రైతులకిచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ఆడబిడ్డల కోసం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme) ఇప్పటికీ పూర్తిగా అమలు కాలేదన్నారు. కాగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిలదీసిన ప్రతిపక్షాలపై ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటల్లా రేవంత్ రెడ్డి మాట్లాడటం లేదని ఆక్షేపించారు. రేవంత్ ఐదేళ్లు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నానన్న కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన ఖర్మ తమకు లేదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రాహుల్, రేవంత్ రెండు నాలుకలు :ఫోన్ ట్యాపింగ్ మీద పెట్టిన శ్రద్ధ మంచినీళ్ల మీద పెట్టాలని ముఖ్యమంత్రిని సూచించారు. రైతు బంధు, దళిత బంధు, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్, బతుకమ్మ చీరలు సహా అన్ని రద్దు చేశారని ఈ సందర్భంగా తెలిపారు. రాహుల్ భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra) అని దేశమంతా తిరుగుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం ప్రధాని మోదీ తన పెద్దన్న అంటు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. లిక్కర్ స్కామ్ జరగలేదని రాహుల్ అంటే, లేదు జరిగిందని రేవంత్ అంటున్నారని, కాంగ్రెస్ పార్టీలో రాహుల్, రేవంత్ రెండు నాలుకలని కేటీఆర్ అభివర్ణించారు.