Kishan Reddy on BJP Manifesto 2024 : పేదలు, మహిళలు, యువత, రైతులే లక్ష్యంగా వచ్చే ఐదేళ్లు పనిచేయాలనే సంకల్పం తీసుకున్నట్లు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వెల్లడించారు. దేశాన్ని గ్లోబల్ మాన్యూఫాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల(Parliament Election) కోసం బీజేపీ సంకల్ప పత్రాన్ని విడుదల చేసిందన్న కేంద్రమంత్రి, 1980నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మేనిఫెస్టోను విడుదల చేస్తున్నామని వివరించారు.
నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ మేనిఫెస్టోను వివరించిన ఆయన, మహిళలకు 33 శాతం రిజర్వేషన్, స్వయం సహాయక సంఘాల బలోపేతం సహా పేపర్ల లీకేజీలు అడ్డుకునేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో పేదలకు 3కోట్ల ఇళ్లు కట్టిస్తామన్న కిషన్‌రెడ్డి, తెల్లరేషన్ కార్డు(Ration Card) లేని మధ్య తరగతి కుటుంబాల్లో సీనియర్ సిటిజన్స్‌కు ఆయుష్మాన్ భారత్ అందించనున్నట్లు వివరించారు. గిగ్ వర్కర్ల కుటుంబాలకు ఈ-శ్రమ్ కార్డు కింద ఇన్సూరెన్స్, విద్యా, ఆరోగ్య సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
"ఈరోజు భారతదేశం, యూకే వంటి దేశాలను వెనుకకు నెట్టేసి ఐదో స్థానంలో ఉన్నాము. రానున్న రోజుల్లో ఐదో శక్తిగా ఉన్నటువంటి భారత్‌ను, మూడో శక్తిగా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశంగా తీసుకొస్తాం. అదేవిధంగా ఇండియాను వచ్చే ఐదేళ్లలో గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దే సంకల్పాన్ని తీసుకున్నాం. దీనిద్వారా ఎంప్లాయిమెంట్ జనరేషన్ పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది."-కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు