Kesineni Brothers Political War: విజయవాడ లోక్ సభ స్థానానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. వడ్డే శోభనాద్రీశ్వరరావు, పర్వతనేని ఉపేంద్ర, లగడపాటి రాజగోపాల్ లాంటి వ్యక్తులు లోక్‌సభకు ఇక్కడి నుంచే వెళ్లారు. అలాంటి స్థానంలో కేశినేని బ్రదర్స్ ఢీ కొంటున్నారు. నువ్వానేనా అన్నట్లు పోరు మారింది. కుటుంబ తగాదాలు వ్యక్తిగత విభేదాలుగా మారి అవి రాజకీయంగా ఇప్పుడు రూపుదాల్చాయి.
విజయవాడ లోక్‌సభకు టీడీపీ కేశినేని శివనాధ్(చిన్ని) పేరు ప్రకటించింది. మరోవైపు సిటింగ్ ఎంపీగా ఉన్న కేశినేని శ్రీనివాస్(నాని) వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఇద్దరూ సొంత అన్నదమ్ములు కావడం. రెండు ప్రధాన పార్టీలకు ప్రాతినిధ్యం వహించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా ఇదే చర్చ జరుగుతున్నా వైసీపీ నుంచి సీటు మార్చే అవకాశం లేకపోలేదన్న వాదన వినిపించింది. తాజాగా ఆయన పేరు ఖరారు చేయడంతో పోటీ రసవత్తరంగా మారింది.
ఒకే జాతి పక్షులన్నీ ఒక గూటికి చేరినట్లు సైకోలంతా జగన్ పంచన చేరారు: కేశినేని
ఇద్దరి ప్రయాణం మొదలైంది ఇలా: 2009లో రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తితో ట్రావెల్స్ వ్యాపారం చూసే కేశినేని శ్రీనివాస్(నాని) చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అందులో కొంతకాలమే ఉన్నారు. విజయవాడ సీటు నానికి దక్కలేదు. 2013లో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్న రోజుల్లో జిల్లాకు చెందిన ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరావు ఆధ్వర్యంలో చంద్రబాబును కలిసి పార్టీలో చేరారు. 2014లో విజయవాడ లోక్‌సభకు పోటీ చేసి విజయం సాధించారు. 2019లోనూ టీడీపీ తరఫున విజయం సాధించారు. రెండు సార్లు వరసగా లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.
ఈ ఎన్నికల్లో అన్నకు తోడుగా కేశినేని శివనాథ్(చిన్ని) ఎన్నికల ప్రచారంలో పాల్గొని, ఆర్థిక వ్యవహారాలు చూసే వారు. సోదరులు విడిపోయిన తర్వాత హైదరాబాద్‌లో సొంతంగా కేశినేని డెవలపర్స్ స్థాపించి సీఈఓగా చిన్ని ఉన్నారు. శివనాధ్ బీటెక్ చదవగా, నాని కేవలం ఇంటర్‌తోనే ఆపేశారు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఎక్కడో ఆర్థికంగా విభేదాలు వచ్చాయి. తర్వాత అవి కుటుంబానికి పాకాయి. క్రమేపీ కేసుల వరకు వెళ్లాయి. 2022లో ఒంగోలులో మహానాడు దీనికి ఆజ్యం పోసింది. ఈ మహానాడుకు విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నాని హాజరు కాలేదు. కేశినేని చిన్ని హాజరయ్యారు. దీనికి ఆయన ఎంపీ స్టిక్కర్ ఉన్న వాహనం తీసుకెళ్లారని దానిపై ఇక్కడ పటమట పోలీసు స్టేషన్‌లోనూ, హైదరాబాద్‌లో చిన్ని భార్య మీద ఎంపీ స్వయంగా ఫిర్యాదు చేసి ఎప్‌ఐఆర్ కట్టించారు. ఇది తారా స్థాయికి చేరింది. నాటి నుంచి టీడీపీలో చిన్ని క్రియాశీలకంగా ఎదగడం ప్రారంభించారు.