Karimnagar Lok Sabha Election 2024 : కరీంనగర్ జిల్లా ఉద్యమాల ఖిల్లా ఐదు జిల్లాలు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించిన ఈ స్థానం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హన్మకొండ జిల్లాల పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలతో ఏర్పడిన ఈ పార్లమెంట్ నియోజకవర్గం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. గతాన్ని చూస్తే ఇక్కడ ఎప్పుడూ ఒకపార్టీ వరసగా రెండుసార్లు గెలిచిన దాఖలాలు లేవు. కమ్యూనిస్టుల నుంచి మెుదలుకొని టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఇలా ప్రతి పార్టీని ఆదరించిన స్థానమిది.
పార్టీలకతీతంగా అభ్యర్థులను దీవించిన నేల ఇది. కానీ! ఈసారి ఎలగందుల ఖిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఈ స్థానంలో గెలుపుపై దృష్టి సారించాయి. దీంతో పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుంది. మరి ఇక్కడి ప్రజలు సాంప్రదాయానికి అనుగుణంగా కొత్తవారికి పట్టం కట్టతారా? లేదా సంప్రదాయానికతీతంగా మరోసారి బండిసంజయ్‌కు పట్టం కడతారా? అనేది నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇక్కడ గెలుపు ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తోంది.
కరీంనగర్ లోక్‌సభ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఉత్తర తెలంగాణలోనే ముఖ్యమైన సీటు కావడంతో ఇక్కడ మూడు పార్టీలు బలంగా పోటీ ఇస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్‌రావు బరిలో నిలవగా ఈ నియోజకవర్గానికి ఇంచార్జిగా మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవహరిస్తున్నారు. ఇతనే ముందుండి ప్రచారం నిర్వహిస్తున్నారు.
కేవలం మోదీ చరిష్మాతోనే ఎన్నికలకు : ప్రస్తుత బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ బండిసంజయ్ ప్రజాహిత యాత్ర పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, సంజయ్ తెచ్చిన నిధుల గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కేంద్రం నుంచి నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చారో వివరిస్తున్నారు. అదే విధంగా హిందుత్వ నినాదం, రామ మందిరం అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఎప్పటికప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తప్పులను ఎత్తి చూపుతున్నారు. నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ మరోసారి గెలుపు కోసం కృషి చేయాలని కోరుతున్నారు. మోదీ నినాదంతో మరోసారి విజయం సాధిస్తాననే ధీమాతో బండి సంజయ్ ఉన్నారు.