Janasena Chief Pawan kalyan Contesting from Pithapuram :టీడీపీ-జనసేన-బీజేపీల మధ్య పొత్తు కుదిరిన విషయం అందరికీ తెలిసిందే. జనసేన పోటీ చేసే సీట్ల వివరాలు కొలిక్కి రావడంతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభ్యర్థుల ఎంపికను కొలిక్కి తెస్తున్నారు. ఇప్పటికే ఆరు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. ఈ తరుణంలో పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానంపై నేటితో ఉత్కంఠ వీడింది. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో ఈ మేరకు ప్రకటన చేశారు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని, ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని, ఎంపీగా పోటీ చేసే అంశంపై పెద్దలతో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలు కేటాయించిన విషయం అందరికీ తెలిసిందే.
మరో 9 మందికి జనసేన గ్రీన్ సిగ్నల్ - అభ్యర్థులతో పవన్ భేటీ
ఇప్పటికే ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆయన బుధవారం రాత్రి మరో 9 మందికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. వారితో మాట్లాడి ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకర్ల రమేశ్, ఎలమంచిలి నుంచి సుందరపు విజయకుమార్, విశాఖ దక్షిణం నుంచి వంశీకృష్ణ యాదవ్‌లను పిలిచి మాట్లాడి ప్రచారం చేసుకోవాలని చెప్పారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు నుంచి పత్సమట్ల ధర్మరాజు, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్, భీమవరం నుంచి మంగళవారం పార్టీలో చేరిన పులపర్తి రామాంజనేయులు అభ్యర్థిత్వాలకు ఆమోదం తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి దేవవరప్రసాద్ అభ్యర్థిత్వం ఖరారు చేశారు. తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులుతో భేటీ అయ్యారు. ఈ స్థానం కూడా దాదాపు ఖరారు అయినట్లు నేతలు చెబుతున్నారు. ఇప్పటికే పార్టీ తరఫున నిడదవోలు నియోజకవర్గం నుంచి కందుల దుర్గేష్, కాకినాడ గ్రామీణం నుంచి పంతం నానాజీ, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి పోటీ చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు లోక్‌సభ స్థానాలను ప్రకటించాల్సి ఉంది.