Jagtial MLA Sanjay Reaction on KTR Comments : మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తాజాగా స్పందించారు. గతంలో ఇతర పార్టీల నుంచి గెలిచి బీఆర్ఎస్లో మంత్రులు కాలేదా ? అని ప్రశ్నించారు. తమను నిందించిన వాళ్లు ముందుగా ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత మొదటిసారి ఆయన జగిత్యాలలోని మీడియాతో మాట్లాడారు. జిల్లా అభివృద్ధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే సాధ్యమని గ్రహించే పార్టీ మారానని స్పష్టం చేశారు.
జగిత్యాలలోని నూకపెల్లిలో 4500 డబుల్ బెడ్ రూమ్‌ల మౌలిక వసతుల కోసం సీఎం రేవంత్ రెడ్డి రూ.32 కోట్ల నిధులు కేటాయించారని సంజయ్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్సీ కవిత ప్రోత్సాహంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. తాను బీఆర్ఎస్ను వీడడం బాధగా ఉందని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలకు అభివృద్ధిలో ప్రాధాన్యత ఉండదన్నారు.
'బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మరికొందరు నాపై రకరకాలుగా మాట్లాడారు. గతంలో కొందరు ఇతర పార్టీలో గెలిచి బీఆర్ఎస్లో చేరలేదా ?ఆనాడు చాలా మంది ఓ పార్టీలో గెలిచి బీఆర్ఎస్లో చేరి మంత్రుల కాలేదా? జిల్లాలో అభివృద్ధి పనుల కోసమే నేను పార్టీ మారాను'- సంజయ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే
అసలేం జరిగిదంటే :సోమవారం జగిత్యాలలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఆ పార్టీ నేతలు ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎవరో ఒకరు పార్టీ వదిలి పోయారని భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు. పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారని, కష్టాలు వచ్చినప్పుడే మనిషి విలువ తెలుస్తుందని పేర్కొన్నారు.