Jaggareddy fires on BJP :రాహుల్ గాంధీ చరిత్ర, రాజకీయం మీద బీజేపీ నేతలు అతిగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. బీజేపీ నాయకులకు తానొకటి స్పష్టంగా చెబుతున్నానని, దేశ రాజకీయాలు రాహుల్ గాంధీ, మోదీ చుట్టే తిరుగుతున్నాయన్నారు. రాహుల్ గాంధీకి, మోదీకి చాలా వ్యత్యాసం ఉందని ఆయన పేర్కొన్నారు. అద్వానీ రథయాత్రకు ముందు దేశానికి, గుజరాత్‌కు మోదీ ఎవరో కూడా తెలియదన్నారు.
అద్వానీ రథయాత్ర పూర్తయ్యాక గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా మోదీ గెలిచిన తర్వాత, సీల్డ్ కవర్‌లో మోదీని సీఎంగా ప్రకటించినట్లు జగ్గారెడ్డి పేర్కొన్నారు. మోదీ సీల్డ్ కవర్ గుజరాత్ సీఎం అని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు మోదీ సీల్డ్ కవర్ సీఎం కాదని చెప్పగలరా? అంటూ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ అనేక రాష్ట్రాల సీఎంలను సీల్డ్ కవర్‌లో డిసైడ్ చేస్తారని, సీఎంలను డిసైడ్ చేసే రాహుల్‌కు, సీల్డ్ కవర్ సీఎం మోదీకి చాలా తేడా ఉందని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు.
Jaggareddy on Ayodhya Rammandir : మోదీ ప్రధాని కాకముందు ఏ పోరాటం చేశారో బీజేపీ నేతలు చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. అధికారంలో నుంచి వచ్చిన లీడర్ మోదీ అని, ప్రజల నుంచి వచ్చిన లీడర్ రాహుల్ గాంధీ అని ఆయన స్పష్టం చేశారు. పేదల కోసం రాముడు పాలన చేశారని, గుడి నిర్మాణం చేస్తే రాముడు సంతోషిస్తానని చెప్పలేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కిషన్ రెడ్డి, ఈటల, బండి సంజయ్‌లు రాజకీయంగా బతకాలి అంటే జై శ్రీరామ్ అనకతప్పదని ఆయన స్పష్టం చేశారు.