SADAREM Slot Booking: దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన ఎన్డీఏ కూటమి నేతలు, అధికారంలోకి వచ్చిన 18 రోజుల్లోనే అమలు చేసింది. తాజాగా జులై 1న సీఎం చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ అందచేశారు. ఇదిలా ఉంటే దివ్యాంగుల పింఛన్ ప్రక్రియ, లబ్ధిదారుల ఎంపికలో సదరం సర్టిఫికెట్ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపికకు జులై 8 నుంచి స్లాట్లు అందుబాటులో ఉండనున్నాయి.
సదరం సర్టిఫికెట్: శారీరక వైకల్యం, మానసిక లోపాలు, కంటి చూపునకు సంబంధించి దృష్టి వైకల్యం ఇతర లోపాలతో బాధపడే వారికి వైకల్యాన్ని నిర్ధారిస్తూ అందించేదే సదరం సర్టిఫికెట్. దీనిని ప్రైవేటు వ్యక్తులు, వైద్యులు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ రకాల కొలమానాల ప్రకారం అందిస్తుంటారు. ఏదైనా ప్రమాదం జరిగి అవయవాలు కోల్పోయిన వారికి ఆర్థో, అందత్వం, వినికిడి, మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం సదరం సర్టిఫికెట్ జారీ చేస్తుంది.
సదరం సర్టిఫికెట్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే పింఛన్, ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్, రాష్ట్ర, కేంద్ర రవాణా సంస్థలైన ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ప్రయాణ చార్జీల్లో రాయితీలు, చిన్న పరిశ్రమ స్థాపనకు రుణాలు, సబ్సిడీకి సదరం సర్టిఫికెట్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో క్యాంపులు నిర్వహిస్తూ ఎంతో మంది దివ్యాంగులకు ప్రభుత్వం సదరం సర్టిఫికెట్లు జారీ చేస్తోంది. ఇప్పటికీ వేలాది మంది దివ్యాంగులు ఈ సదరం సర్టిఫికెట్లు పొంది వివిధ మార్గాల్లో లబ్ధి పొందుతున్నారు.