TG High Court on BRS MLA's Disqualification Petition : బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ నిర్వహించారు. జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ఈ పిటిషన్‌పై మరోసారి విచారించారు. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలు భారత రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ముగ్గురిని అనర్హులుగా ప్రకటించాలంటూ కూకట్‌పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్, హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరన్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఒక పార్టీ గుర్తుపై గెలిచి, మరో పార్టీలోకి వెళ్లడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని, ఇలాంటి ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన 3 నెలల్లో అనర్హతా వేటు వేయాలని సుప్రీంకోర్టు తీర్పులున్నాయని ఆయన కోర్టుకు తెలిపారు. రాజీనామా చేయకుండా పార్టీ మారడం చట్ట విరుద్దమన్నారు. ఈ విషయంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఫిర్యాదు చేసి 3 నెలలు గడిచినా కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పైగా స్పీకర్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన కౌంటర్‌లోనూ వివరాలు సరిగ్గా లేవని తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం, విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది.
ఎమ్మెల్యేల వరుస పార్టీ ఫిరాయింపులు - సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న బీఆర్‌ఎస్