Harish Rao about KRMB Project in Assembly : పదేళ్లలో బీఆర్ఎస్ ఎప్పుడూ కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగించలేదని మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ప్రాజెక్టులు అప్పగించారని ఆరోపించారు. ప్రాజెక్టుల అప్పగింత కుదరదని కేసీఆర్ రెండో అపెక్స్ భేటీలోనే స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఫిబ్రవరి 13న తాము నల్గొండలో సభ పెట్టినందువల్లే అసెంబ్లీలో కృష్ణా ప్రాజెక్టులపై తీర్మానం పెట్టారని వాఖ్యానించారు. ఇవాళ అసెంబ్లీలో కృష్ణా ప్రాజెక్టులు, కేఆర్‌ఎంబీ సంబంధిత అంశాలపై ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాడీవేడిగా చర్చలు కొనసాగాయి.
బీఆర్ఎస్పై బురద జల్లేందుకు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చూస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. పోతిరెడ్డిపాడు కోసం పేగులు తెగేదాక కొట్లాడింది బీఆర్ఎస్సేనని, కాంగ్రెస్ నేతలు పదవుల కోసం పెదవులు మూసుకున్నారని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లి స్టే తెచ్చామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన ఒక నెలలోనే కృష్ణా జలాల పునఃపంపిణీకి కేంద్రానికి లేఖ పెట్టామని చెప్పారు. ఒకటిన్నర సంవత్సరం అయినా కేంద్రం స్పందించకుంటే తాము సుప్రీంకోర్టుకు వెళ్లామని పేర్కొన్నారు. కృష్ణా జలాల పంపిణీపై కేంద్రానికి 35 నుంచి 40 లేఖలు రాశామని తెలిపారు.
బీఆర్ఎస్(BRS) పోరాటం వల్లే కృష్ణా జలాల పంపిణీకి ట్రైబ్యునల్ ఏర్పాటు చేశారని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రాణాలు పోయినా తెలంగాణ ప్రయోజనాలకు నష్టం చేయరని ఉద్ఘాటించారు. సముద్రంలో కలిసే గోదావరి నీళ్లను తీసుకెళ్లేందుకు ఏపీకి అనుమతించారని అన్నారు. తమ నేత సోనియా గాంధీని దేవత అన్నారని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెను బలిదేవత అన్నారని గుర్తు చేశారు. కేసీఆర్ తెలంగాణను బ్రహ్మాండంగా పాలించారని చెప్పారు. ఇది గాంధీభవన్ కాదు, శాసనసభ అని అధికార నాయకులను ఉద్దేశించి హరీశ్‌రావు మండిపడ్డారు. కేఆర్‌ఎంబీ ప్రాజెక్టుపై స్మితా సభర్వాల్ తరహాలోనే రాహుల్ బొజ్జా కూడా లేఖ రాశారని ఆయన పేర్కొన్నారు.
Harish Rao about KCR in Assembly : కేసీఆర్ గురించి కొందరు వ్యక్తిగతంగా తూలనాడుతున్నారని, ఆయన లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదని హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ లేకుంటే, రేవంత్‌రెడ్డి సీఎం అయ్యేవాడే కాదని వాఖ్యానించారు. కాంగ్రెస్ పాలకులు అధికారులపైకి తమ తప్పులు నెడుతున్నారని ఆరోపించారు. తీర్మానంలోని డిమాండ్లకు తాము మద్దతు తెలుపుతున్నామని తెలిపారు. తీర్మానంలో పెట్టినవి తాము గతంలో పెట్టిన డిమాండ్లేనని చెప్పారు. కృష్ణా జలాల్లో సగం వాటా కోసం తాము గతంలో ఎన్నో లేఖలు రాశామని గుర్తు చేశారు.