GWMC Council Meeting In warangal : విపక్ష కార్పొరేటర్ల నిరసనల మధ్య వరంగల్ మహానగర పాలక సంస్థ వార్షిక బడ్జెట్ అంచనాలకు మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన పాలక వర్గం ఆమోదించింది. 1/3 కోరం ఉన్న తర్వాత నగరపాలక సంస్ధ కార్యాలయంలో బడ్జెట్ సమావేశాన్ని ప్రారంభించారు. బల్దియా అకౌంట్స్ అధికారి బడ్జెట్ అంచనాలను వెల్లడించగా మెజారిటీ సభ్యులు అంగీకారం తెలపడంతో పాలక వర్గం బడ్జెట్‌ను ఆమోదించింది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల పోటా పోటీ నినాదాలు :రూ.650 కోట్ల 12 లక్షల అంచనాలతో బడ్జెట్ రూపొందించారు. ఇందులో రూ.237 కోట్ల 2 లక్షలు సాధారణ పన్నుల ద్వారా, రూ.410 కోట్ల 10 లక్షలు వివిధ గ్రాంట్ల ద్వారా సమకూరుతుందని అంచనా వేశారు. బడ్జెట్ ఆమోదం సందర్భంగా సభలో గందరగోళం చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల పోటా పోటీ నినాదాలతో సమావేశం హోరెత్తింది. మేయర్ పార్టీ ఫిరాయించినందున బడ్జెట్ ప్రవేశపెట్టే అర్హత లేదంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు నల్లబ్యాడ్జీలు, కండువాలు ధరించి ప్లకార్డులతో నిరసన చేపట్టారు. బడ్జెట్ ప్రతులను చింపివేశారు. ప్రతిగా కాంగ్రెస్ కార్పొరేటర్లు నినాదాలు చేయడంతో సభలో గందరోగళం ఏర్పడింది.
Municipal Corporation Approved The Budget :చివరికి సభ్యుల నిరసనల నడుమే వార్షిక బడ్జెట్‌కు పాలకమండలి ఆమోద ముద్ర వేసింది. సభ్యుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లతో కలసి ఎంఎల్సీలు బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పరకాల శాసనసభ్యులు రేవురి ప్రకాష్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎంఎల్ఏ నాయిని రాజేందర్ రెడ్డి, శాసనసభ్యులు కె.ఆర్.నాగరాజు, హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య , జీడబ్ల్యూఎంసి కమిషనర్ అశ్వినీ తానాజీ వాఖేడే, హనుమకొండ అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, డెప్యుటీ మేయర్ రిజ్వాన శమిమ్ మసూద్, బల్దియా వింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్పొరేటర్లు పాల్గొన్నారు.
అంతకు ముందు సమావేశంలో ఘర్షణలు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ మున్సిపల్ ఆఫీస్ ముందు ప్రధాన ద్వారం వద్ద భారీగా పోలీసులను నియమించారు. బయటి వ్యక్తులను లోనికి రాకుండా చర్యలు చేపట్టారు. మొత్తానికి సమావేశంలో గందరగోళం చోటు చేసుకున్నా బడ్దెట్కు ఆమోద ముద్ర పడటంతో పాలక వర్గ సభ్యులు ఊపిరి పీల్చుకున్నాారు.