Venkaiah Naidu Comments on Politics: ప్రజా జీవితంలో సిద్ధాంతాలు, విలువలు, సంప్రదాయాలను గౌరవించాలని పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రజాప్రతినిధులకు ఉద్భోదించారు. పోలీసు స్టేషన్లపై, రెవెన్యూ కార్యాలయంపై పెత్తనం కాకుండా అభివృద్ధిపై నేతలు దృష్టి ఉండాలని హితవు పలికారు. విజయవాడ శివారు నిడమానూరులో వెంకయ్యనాయుడు 75 వసంతాలు పూర్తి చేసుకుని 50 ఏళ్ల ప్రజాజీవనంలో అలుపెరగని ప్రయాణం సాగిస్తున్నందుకు అభినందిస్తూ ఆత్మీయ సంగమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, మిత్రులు, బంధువులు, అధికారులను వెంకయ్యనాయుడు ఆత్మీయంగా పలకరించారు. వారంతా సముచితంగా సత్కరించారు.
అదొక్కటే తీరని వెలితి:ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు తన బాల్యం, విద్య, రాజకీయ ప్రవేశం, ఉన్నత పదవులు, ఇతర జీవిత విశేషాలు, అనుభవాలను తన ప్రసంగంలో సమగ్రంగా వివరించారు. చిన్నతనం నుంచి ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వాటిని అవకాశాలుగా మలచుకుంటూ ముందడుగు వేశానని చెప్పారు. చిన్నతనంలోనే తన తల్లి చనిపోవడం ఒక్కటే తనకు తీరని వెలితి తప్ప ఇంతవరకు ఎందులోనూ తనకు అసంతృప్తి లేదన్నారు. న్యాయవాది కావాలనే తన తల్లి ఆలోచనకు అనుణంగా లా చదివినా, ఇందిరాగాంధీ విధించిన ఎమర్జన్సీ కారణంగా జైలుకు వెళ్లి న్యాయవాద వృత్తిలో ప్రాక్టీస్ చేయలేకపోయానని చెప్పారు.
పాలకులు ఉచితంగా విద్య, వైద్యం అందిస్తే సరిపోతుంది : వెంకయ్యనాయుడు - Venkaiah Naidu on Free Schemes
ఓడించినా వారికి ధన్యవాదాలు: విద్యార్ధి నాయకుడిగా తనకు ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం లభించినా, తొలి ఎన్నికల్లో ఓటమి కారణంగా ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగి రెండుసార్లు వరుసగా గెలిపించిన అక్కడి ప్రజలకు తాను జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. ఆ తర్వాత నియోజకవర్గం మారి ఆత్మకూరు వెళ్లినా అక్కడి ప్రజలు తనను ఓడించిన కారణంగానే రాష్ట్రస్థాయి నుంచి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సి రావడం వల్ల అక్కడి ప్రజలకు తాను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. కబడ్డీపై ఉండే ఆసక్తి కారణంగానే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో చేరానని, అక్కడే నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలనే ఆలోచన, క్రమశిక్షణ, కష్టపడే తత్వం, సమాజ చింతన అలవడ్డాయని అన్నారు.