KTR Tweet on GO 33 : తెలంగాణ విద్యార్థులకు మెడిసిన్ సీట్ల విషయంలో అన్యాయం చేస్తారా అని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. స్థానికత విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అనుమానాస్పదంగా కనిపిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 33 ప్రకారం నిర్ధేశించిన స్థానికతలోని అంశాలు, వేలితో విద్యార్థుల కళ్లను పొడిచినట్లే ఉన్నాయని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. మన రాష్ట్రంలో 9వ తరగతి నుంచి 12 తరగతి వరకు చదివిన విద్యార్థులే స్థానికులవుతారని చెబుతున్నారని, ఈ నిర్ణయం ప్రకారం చాలా మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులే తెలంగాణలో లోకల్ అవుతారని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఉన్నందున ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చాలా మంది ఇక్కడే విద్యాభ్యాసం చేస్తున్నారని, కొత్త నిబంధనల ప్రకారం వారంతా తెలంగాణలో లోకల్ అవుతారని అన్నారు. అదే విధంగా ఇతర రాష్ట్రాల్లో చదివే మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు నాన్ లోకల్ అయ్యే ప్రమాదం ఉందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. 2023-24 విద్యా సంవత్సరం వరకు 6వ తరగతి నుంచి 12 తరగతి వరకు నాలుగేళ్లు గరిష్టంగా ఎక్కడ చదివితే అదే స్థానికతగా గుర్తించినట్లు వివరించారు. ఆ కారణంగా మన విద్యార్థులు ఇంటర్మీడియట్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పటికీ వారిని లోకల్‌గానే పరిగణించే వారని తెలిపారు.