Harish Rao Reaction on Telangana Budget : రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆశలు నీరుగార్చిందని, ఆత్మస్తుతి, పరనింద అన్న చందంగా ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభ్యులు హరీశ్‌రావు ఆక్షేపించారు. 6 గ్యారంటీలు నీరు గారిపోయాయని, సంక్షేమం పడకేసిందని, అంతా అగమ్యగోచరంగా తయారైందని మండిపడ్డారు. బడ్జెట్‌లో గ్యారంటీల ప్రస్తావన లేదన్న ఆయన, ఎన్నికలప్పుడు గ్యారంటీల గారడీ, బడ్జెట్‌లో అంకెల గారడీ అని ఎద్దేవా చేశారు. ప్రజలను బురిడీ కొట్టించేందుకు, భ్రమలు కల్పించేందుకు చేసిన ప్రయత్నమన్న హరీశ్‌రావు, తిరోగమన బడ్జెట్‌గా అభివర్ణించారు.
కోటి మంది అక్కాచెల్లెళ్లకు శుభవార్త చెబుతారనుకుంటే నిరాశే మిగిలిందని, మహాలక్ష్మి అని నిరాశకు గురి చేశారని పేర్కొన్నారు. రూ.4,000 పింఛన్ ఏమైందని ప్రశ్నించిన మాజీ మంత్రి, పేదల ప్రభుత్వం, పేదల కోసం అని చెప్పుకునే అర్హత లేదని మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్దిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేశారని కళ్లుండి చూడలేని కబోదుల్లా మాట్లాడారన్న హరీశ్‌రావు, ప్రజలు నవ్వుకుంటారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ అభివృద్ధి రజినీలకు అర్థమైంది కానీ, కాంగ్రెస్ గజినీలకు అర్థం కాలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వంపై విమర్శలు తప్ప, హామీల అమలుపై సర్కార్‌కు దృష్టి లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ నేతలు తమదిగా చెప్పుకుంటున్నారని, గత పదేళ్లలో జరిగిన అభివృద్ధిని కూడా తమ అభివృద్దిగా చెప్పుకునే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించారు.
బడ్జెట్‌లో కొత్త ప్రతిపాదనలేం లేవు - ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం : కేసీఆర్ - KCR REACTION ON BUDGET ALLOCATION
పదేళ్ల బీఆర్ఎస్, కేసీఆర్ పాలన కారణంగానే తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన ఉందని, రాష్ట్ర స్థూల ఉత్పత్తి 3 రెట్లు పెరిగిందంటే తమ ప్రభుత్వ పని తీరు కాదా అని ప్రశ్నించారు. పదేళ్లలో పని జరగలేదని చెబితే ప్రజలు నవ్వుకోరా అన్న ఆయన, బడ్జెట్ ప్రసంగంలో చెప్పినంత మాత్రాన అబద్ధాలు నిజాలవుతాయా అని అడిగారు. రైతు రుణమాఫీ విషయంలో దేవుళ్లపై ఒట్టు పెట్టి బడ్జెట్‌లో రూ.15,479 కోట్లు మాత్రమే కేటాయించారని, ఏకకాలంలో రూ.31 వేల కోట్లు ఎలా మాఫీ చేస్తారని హరీశ్‌రావు ప్రశ్నించారు. కోతలు పెట్టడానికి నాటకాలు ఆడుతున్నారని, రాహుల్, ప్రియాంక ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయని అన్నారు. నీటి పారుదలకు కేటాయింపులు తగ్గాయని, ఫించన్లకు తక్కువ మొత్తం కేటాయించడమంటే కొత్త పింఛన్లు ఇవ్వబోరని వ్యాఖ్యానించారు.
ఇది పూర్తిగా తిరోగమన బడ్జెట్. 6 గ్యారంటీలు నీరు గారిపోయాయి. సంక్షేమం పడకేసింది. అంతా అగమ్యగోచరం. ఎన్నికలప్పుడు గ్యారంటీల గారడీ. బడ్జెట్‌లో అంకెల గారడీ. ప్రజలను బురిడీ కొట్టించేందుకు, భ్రమలు కల్పించేందుకు చేసిన ప్రయత్నం. కోటి మంది అక్కా చెల్లెళ్లకు శుభవార్త చెబుతారనుకుంటే నిరాశే మిగిలింది. మహాలక్ష్మి అని మహా నిరాశ చేశారు. రూ.4 వేల పింఛన్ ఏమైంది? పేదల ప్రభుత్వం, పేదల కోసం అని చెప్పుకునే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు. - హరీశ్‌రావు, మాజీ మంత్రి
పీఆర్సీ ప్రస్తావన, నిధుల కేటాయింపు లేదని, 5 డీఏల గురించి నోరు విప్పలేదని, కొత్త ఉద్యోగులకు సరిపడా నిధులు లేవని హరీశ్‌రావు ఆక్షేపించారు. ఎక్సైజ్ పన్ను ద్వారా రూ.7,045 కోట్లకు పైగా ఆదాయం పెంచుకుంటామని పెట్టారని, అంటే తాగుబోతు తెలంగాణ చేస్తారా అని మాజీ మంత్రి ప్రశ్నించారు. మద్యంపై రూ.14 వేల కోట్లు ఎక్కువగా సంపాదించాలని అనుకుంటున్నారా అని అడిగారు. ప్రజలపై పన్నుల భారం వేస్తామని బడ్జెట్‌లో చెప్పకనే చెప్పారని ఆరోపించారు. పన్నేతర ఆదాయం రూ.35 వేల కోట్లు ఎలా వస్తుందని, భూములు అమ్ముతారా అని అడిగారు. రాష్ట్రంలోని భూములు అన్నీ అమ్ముతారని, భూముల అమ్మకానికి రంగం సిద్ధం చేశారని పేర్కొన్నారు.
కేంద్రం నుంచి నిరుడు రూ.9729 కోట్ల గ్రాంట్లు వస్తే, ఇప్పుడు ఏకంగా రూ.21,636 కోట్లు పెట్టారని, ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. అంతా అంకెల గారడీ చేశారని, చివరకు ఆదాయం రాక ఏదో పథకానికి కోతలు పెడతారని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. నగదుపై వడ్డీ ద్వారా రూ.605 కోట్లు వస్తుందని పెట్టారని, నిరుడు రూ.24 లక్షలు నెగెటివ్ వచ్చాయని గుర్తు చేశారు. ఈ ఏడాది అప్పులపై వడ్డీలు రూ.17,729 కోట్లు, అసలు రూ.13,117 కోట్లు కట్టాలని సీఎం, డిప్యూటీ సీఎం నెలకు రూ.7000 కోట్లు కడుతున్నామని చెప్పారని ఆక్షేపించారు. గత ప్రభుత్వం పల్లెలకు మౌలిక వసతులు కల్పించలేదని చెబితే ఎవరైనా నమ్ముతారా అన్న ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం 8 నెలల్లో 8 పైసలు కూడా పంచాయతీలకు ఇవ్వకపోగా, కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా ఆపారని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణను ధాన్యాగారంగా మార్చాం : కేటీఆర్ - BRS Leaders Visited Medigadda