Harish Rao on Cm Revanth about Telangana Debt : రాష్ట్రంలో అప్పుల పాలైందన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల పట్ల మాజీమంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద ఏర్పడిందని, సీఎం రేవంత్ పదేపదే అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. 16వ ఆర్థిక సంఘం ముందు సైతం అబద్ధాలను చెప్పడం సిగ్గు చేటన్నారు. మంగళవారం మెదక్‌లో బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాల్సిన ముఖ్యమంత్రే తెలంగాణ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు.
రాష్ట్రం దివాలా తీసిందని, ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నట్లు ముఖ్యమంత్రే చెప్పడం రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడమే అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.6.85 లక్షల కోట్ల అప్పుందనే తప్పుడు ప్రచారాన్ని ఇంకెన్నిసార్లు, ఇంకెన్ని రోజులు చేస్తారని సీఎం రేవంత్‌ను ఉద్దేశిస్తూ ప్రశ్నించారు. ప్రచార సభల్లో, 16వ ఆర్థిక సంఘం ముందు, చివరికి ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమాల్లో కూడా అదే తొండి వాదన వినిపించడం వల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏముందని ఎద్దేవా చేశారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే రాష్ట్ర అప్పుల విషయంలో సీఎం రేవంత్ చేసిన తప్పుడు ప్రచారన్ని తిప్పి కొడుతూ వాస్తవాలు వెల్లడించానని తెలిపారు.