Former Minister Alla Nani Resigned from YSRCP:వైఎస్సార్సీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే కీలక నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండగా తాజాగా ఆ జాబితాలో మరొకరు చేరారు. మాజీ మంత్రి ఆళ్ల నాని వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆళ్ల నాని చెప్పారు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్ష, ఏలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పదవులకు కూడా ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఆళ్ల నాని మాట్లాడుతూ ఏలూరులో పార్టీ ఆఫీస్ కూల్చివేతపై వచ్చిన ఆరోపణలు కేవలం అపోహలు మాత్రమేనని అన్నారు. గత ఏడాదిగా పార్టీ కార్యాలయం ఉన్న స్థలాన్ని యజమానికి తిరిగి ఇవ్వాలని కోరుతున్నారని తెలిపారు. ఈ విషయం పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డికి కూడా తెలుసని అన్నారు. ఈ నెల 16 వ తేదీన యజమాని స్థలాన్ని పూర్తి స్థాయిలో హ్యాండోవర్ చేసుకున్నారని ఆళ్ల నాని తెలిపారు. ఇందులో ఎలాంటి ఆరోపణలుకి తావు లేదని వివరించారు.
ఇటీవల తాను ఏలూరు జిల్లా అధ్యక్ష ఏలూరు ఇంచార్జీ పదవికి రాజీనామా చేశాననని ఇప్పుడు వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. గెలుపు ఓటములకి అతీతంగా ఏలూరు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. ఇకపై వ్యక్తిగా అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. తన రాజీనామా కేవలం తన వ్యక్తిగతం మాత్రమేనని ఆళ్ల నాని స్పష్టం చేశారు.