Ex MLA Chirumarthi Lingaiah investigation in Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత, నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్లు తెలిపారు. ఈనెల 9న తనకు నోటీసులు ఇచ్చారని, పోలీసులు చిన్న విషయాన్నీ పెద్దగా చూస్తున్నారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌తో తనకు సంబంధం లేదని అన్నారు. తనకు తెలిసిన అధికారి అయినందున తాను గతంలో అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో మాట్లాడినట్లు వెల్లడించారు.
ఓ కేసులో మదన్ రెడ్డి, రాజ్ కుమార్ ఫోన్ నంబర్లు తిరుపతన్న అడిగారని, వారి ఇద్దరు ఫోన్ నంబర్స్ తన అనుచరులతో తీసుకొని అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకి ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. అదేవిధంగా ప్రచార సమయంలో అదనపు ఎస్పీ (సస్పెండెడ్) తిరుపతన్నతో మాట్లాడిన మాట వాస్తవమని తెలిపారు. అంతేకానీ ఫోన్ ట్యాపింగ్‌తో తనకు ఎటువంటి సంబంధం లేదని వివరించినట్లు పేర్కొన్నారు. పోలీసులు వాళ్ల దగ్గర ఉన్న ఆధారాలతో తనను పిలిచి విచారించారని, తాను సమాధానం చెప్పానన్నారు.
పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తా : ఈ కేసులో ఎప్పుడు విచారానికి పిలిచినా తాను పోలీసులకు సహకరిస్తానని చెప్పుకొచ్చారు. అంతకముందు తెలంగాణ భవన్‌కు చేరుకున్న చిరుమర్తి, ఎమ్మెల్యేగా పనిచేసిన తనకు పలువురు అధికారులతో పరిచయాలు ఉంటాయని, మాట్లాడుతుంటానని అందులో తప్పేమీ ఉందని ప్రశ్నించారు. నోటీసులతో బెదిరించి తన గొంతు నొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అది ఎప్పటికీ నెరవేరదన్నారు. ఇప్పటి వరకు పోలీసుల చుట్టే తిరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మూడు రోజుల క్రితం పోలీసులు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇవాళ విచారణకు హాజరయి, అనంతరం మాట్లాడారు.