KTR said BRS Fact Finding Committee for Deaths in Gandhi Hospital :గాంధీ ఆసుపత్రిలో కొనసాగుతున్న మాతా, శిశు మరణాలపై బీఆర్ఎస్ తరపున ఒక నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. నిపుణుల కమిటీ గాంధీలో జరుగుతున్న మరణాలపై అధ్యయనం చేసి, గుర్తించిన అంశాలను ప్రభుత్వంతో పాటు ప్రజలతోనూ పంచుకుంటామని పేర్కొన్నారు. పార్టీ తరపున చేసే ఈ ప్రయత్నంలో ప్రభుత్వం కలిసి రావాలని, ప్రజల ఆరోగ్యాలను బాగుపరిచేందుకు బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా తాము ఇచ్చే సలహాలు, సూచనలు స్వీకరించాలని కోరారు. గాంధీ ఆసుపత్రిలో జరుగుతున్న మరణాలపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం, తమ పార్టీపై ఎదురుదాడికి దిగడం బాధాకరమని అన్నారు.
సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాల్సింది పోయి సమస్యను పక్కదారి పట్టించే కార్యక్రమానికి తెరలేపిందని కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికైనా మరణాలపై సమీక్షించారా నాణ్యమైన వైద్యం అందించే విషయమై దృష్టి సారించారా లేదా అని ప్రశ్నించారు. మొన్నటి బదిలీల్లో సీనియర్ వైద్యులను బదిలీపై పంపారన్న ఆరోపణల్లో వాస్తవం ఉందా లేదా? అనే ప్రశ్నలకు బదులు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గాంధీ ఆసుపత్రిలో ఉన్న అనుభవజ్ఞులైన డాక్టర్లను బదిలీ చేయడంతో అక్కడ చికిత్సలకు తీవ్రమైన ఆటంకం ఏర్పడుతుందని విషయాన్ని గుర్తించాలని, దీన్ని అరికట్టి మరణాలను తగ్గించే ప్రయత్నం చేయాలని సూచించారు.
పసిపిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు :వైద్యం అందక పసిపిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు మహాప్రభో అంటే బురదజల్లుతున్నారని మాట్లాడతారా అని కేటీఆర్ మండిపడ్డారు. నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించినట్లు బీఆర్ఎస్ ప్రైవేటుకు కొమ్ముకాయాలనుకుంటే హైదరాబాద్ నగరం చుట్టూ పెద్ద ఆసుపత్రులు, వరంగల్ నిర్మాణంలో ఉన్న అతిపెద్ద ఆసుపత్రి, రెండు నుంచి 33 ప్రభుత్వ వైద్య కళాశాలల పెంపు జరిగేదా అని ప్రశ్నించారు. బస్తీ దవాఖానాలు, గ్రామాల్లో క్లినిక్లు, కేసీఆర్ కిట్లు, సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవడం లాంటి వాటిని గుర్తు చేశారు. తమపై ఎదురుదాడి తర్వాత కానీ, ముందు పాలనలో ఉన్న లోపాలు సరిదిద్దుకోవాలని సూచించారు.