Ex CM KCR Election Campaign in Jagital :ఇక్కడి కరవు పరిస్థితులను చూసి వరద కాల్వను పునరుజ్జీవ పథకంతో నీళ్లతో నింపామని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పుడు కాల్వను ఎందుకు ఎండ బెడుతున్నారో అర్థం కావడం లేదని ఆవేదన చెందారు. జగిత్యాల జిల్లా చేసుకున్నాం కానీ రేవంత్ రెడ్డి తీసేస్తానని అంటున్నారని జిల్లా కావాలా వద్దా అంటూ ప్రశ్నించారు. జగిత్యాల జిల్లాలో నిర్వహించిన బస్సు యాత్ర రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ బస్సు యాత్రలో కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వినోద్ కుమార్, కొప్పుల ఈశ్వర్, బాజిరెడ్డి గోవర్ధన్‌ను మాజీ సీఎం కేసీఆర్ పరిచయం చేశారు.
రైతుబంధు వచ్చిందా డబ్బులు ఖాతాల్లో పడ్డాయా, మరి సీఎం రేవంత్ రెడ్డి ఖాతాల్లో డబ్బులు జమ చేశానని అంటున్నారని మాజీ సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. అలాగే ఒక్కొక్కరి ఖాతాల్లో ప్రధాని మోదీ 15 లక్షలు వేశారంట జగిత్యాలలో ఉన్నవారికి రాలేదా అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, మభ్యపెట్టే మోసాలతో ఓట్లు దండుకున్నారని మాజీ సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. రైతుబంధు ఐదు ఎకరాలకు సీలింగ్ పెడతారట, 25 ఎకరాలకు పెట్టాలని సూచించారు.
బీఆర్ఎస్కు ఎంపీలు ఎందుకు అంటున్నారు, నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచారు ఒక్క పైసా అయినా తెలంగాణకు తెచ్చారా అంటూ బీజేపీ ఎంపీలపై ప్రశ్నల వర్షం కురిపించారు. నిజామాబాద్‌లో గెలిచిన అర్వింద్ పొద్దున లేస్తే విషం చిమ్మడం తప్ప చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. నూకలు తినమన్న నూకరాజు ప్రధాని మోదీ అంటూ ఎద్దేవా చేశారు. గోదావరి జలాలు తీసుకుపోతానని ప్రధాని మోదీ అంటున్నారు, ఇలా తీసుకొని వెళ్లిపోతే మన జలాల గురించి ఎవరు కొట్లాడుతారు, బీజేపీ వాళ్లు అంటూ విమర్శలు చేశారు.